కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు సినిమా షూటింగులన్నీ అటకెక్కిన సంగతి తెలిసిందే. కొన్ని చిత్రాలు అడపాదడపా ఓటీటీలలో సందడి చేస్తున్నప్పటికీ…షూటింగులు మాత్రం మొదలు కాలేదు. ఇపుడిపుడే కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో తాజాగా టాలీవుడ్ లో షూటింగ్ సందడి మొదలైంది. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విలక్షణ దర్శకుడు సుకుమార్ ల కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. షూటింగ్ పట్టాలెక్కింది.
సికింద్రాబాద్‌లో 45 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేయాలని సుకుమార్ ఫిక్స్ అయ్యారట. ఈ షెడ్యూల్ తో పుష్ప మొదటి పార్ట్ పూర్తవుతుందట. ఈ ఏడాది చివరలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌పాత్రలో టాలీవుడ్‌కు తొలిసారి పరిచయమవుతున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
మరోవైపు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారని టాక్ వస్తోంది. స్పెషల్ సాంగ్‌లో చిరు ఇలా వచ్చి వెళ్లిపోతారని అంటున్నారు. చిరు అంటే బన్నీకి అమితమైన ప్రేమ. ఇక, మెగా స్టార్, ఐకాన్ స్టార్ ఒకే ఫ్రేములో కనిపిస్తే మెగా అభిమానులకు పండగే అని చెప్పాలి. గతంలో శంకర్ దాదా జిందాబాద్ లోని ఓ పాటలో మెగా ఫ్యామిలీ కనిపించిన సంగతి తెలిసిందే.