టాలీవుడ్ విలక్షణ దర్శకుడు పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండల కాంబినేషన్ ల వచ్చిన లైగర్ చిత్రం డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల ఖాతాలో ఫ్లాప్ గా నిలిచింది. దీంతో, ఈ సినిమా కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. దీంతో, తమ నష్టాలను పూడ్చాలంటూ పూరీ జగన్నాథ్ ను వారు కోరారు. అయితే ఒక నెలరోజులు గడువిస్తే డబ్బులు సర్దుబాటు చేస్తానని పూరీ గతంలో చెప్పారు.
కానీ, పూరీ చెప్పిన డెడ్ లైన్ దాటిపోయినా సరే డబ్బులు ఇవ్వకపోవడంతో బయ్యర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ డబ్బు ఇవ్వకపోతే ధర్నా చేస్తామంటూ పూరీ జగన్నాథ్ ను వారు బెదిరించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బయ్యర్లకు, పూరీకి మధ్య జరిగిన ఫోన్ కాల్ కు సంబంధించిన ఆడియో ఒకటి లీక్ అయింది. దీంతో, తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అంటూ బయ్యర్లపై పూరీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఒక నెలలో డబ్బులు ఇస్తానని చెప్పినా అతి చేస్తే అసలు డబ్బులు ఇవ్వాలనిపించదని పూరీ అన్నారు. సినిమా అనేది గ్యాంబ్లింగ్ అని ఒక సినిమా హిట్ అయితే మరో సినిమా ప్లాప్ అవుతుందని చెప్పారు. సినిమా హిట్ అయితే డబ్బులు తీసుకోవడానికి బయ్యర్ల చుట్టూ తిరగాలని, పోకిరి దగ్గర నుంచి మొదలుపెడితే ఇస్మార్ట్ శంకర్ వరకు బయ్యర్ల దగ్గర నుంచి తనకు రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయని పూరి అన్నారు.
అలా రావాల్సిన బకాయిలను బయ్యర్స్ అసోసియేషన్ వసూలు చేయదు కదా అని పూరి ప్రశ్నించారు. అంతేకాదు ధర్నా చేసే బయ్యర్ల లిస్టు తీసుకుంటానని, వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని పూరి తేల్చి చెప్పేశారు. మిగతా వారికి డబ్బులు ఇస్తానని పూరీ అన్నట్టుగా ఉన్న ఆ ఆడియో వైరల్ అయింది. మరి, ఈ వ్యవహారంపై సినీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.