టాలీవుడ్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. మిగతా స్టార్ డైరెక్టర్ల మాదిరి ఆయన సక్సెస్ రేట్ ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ ఇచ్చిన కొన్ని హిట్లు, బ్లాక్బస్టర్లతోనే సంచలనం రేపాడాయన. పూరి మార్కు హీరో క్యారెక్టర్లు, వాటి ఫిలాసఫీలు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అమాంతం పెంచాయి.
ముఖ్యంగా తన హీరో పాత్రలతో ఆయన చెప్పించే డైలాగులు, ఫిలాసఫీలు యూత్‌కు మాంచి కిక్కు ఇచ్చేవి ఒకప్పుడు. కానీ తర్వాత తర్వాత ఆయన క్యారెక్టర్లు తేలిపోతూ వచ్చాయి. ఆయన ఫిలాసఫీలు ఒక దశ దాటాకా మెట్ట వేదాంతంలా అనిపించసాగాయి.
క్యారెక్టర్లు పండక, కథలు మొహం మొత్తేసి సినిమాలు వరుసగా బోల్తా కొట్టడం మొదలైంది. మధ్యలో ‘ఇస్మార్ట్ శంకర్’ ఫ్లూక్‌లో హిట్టయిపోయినా.. తర్వాత ‘లైగర్’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు పూరి. ఈ సినిమా వల్ల దారుణంగా నష్టపోయిన బయ్యర్లకు సెటిల్ చేసే విషయంలో పూరికి, వారికి పెద్ద గొడవ నడుస్తోంది.
డిస్ట్రిబ్యూటర్లకు పూరి వార్నింగ్ ఇచ్చిన ఆడియో లీక్ కావడం, తర్వాత అవతలి వర్గంపై ఆయన ఫిర్యాదు చేయడం.. అదే సమయంలో ఫైనాన్షియర్లు, డిస్ట్ర్రిబ్యూటర్లు ఆయన మీద ఎదురు దాడి చేస్తూ తమ వాదనను ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపించే ప్రయత్నం చేయడం జరిగింది.
ఈ క్రమంలో తన ఇమేజ్ కొంత డ్యామేజ్ అవుతుండడంతో పూరి ఒక లేఖను విడుదల చేశాడు తాజాగా. అందులో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి.. డబ్బుల గురించి పూరి చెప్పిన ఫిలాసఫీ బాగానే ఉంది. కొందరు ఆ లేఖను చూసి ఆహా ఓహో అనేస్తున్నారు. కానీ ఈ లేఖ ఇప్పుడు రిలీజ్ చేసి పూరి ఏం చెప్పదలుచుకున్నాడన్నదే అర్థం కావట్లేదు.
ఎఫ్పట్నుంచో తన సినిమాల్లో పాత్రలతో, అలాగే తన పాడ్‌కాస్ట్‌ల్లో పూరి చెబుతున్నా విషయాలే ఇవి. ఇలాంటివి ఆయన ఎన్నయినా చెప్పగలడు. బయట కూడా ఇలాంటి ‘కోట్స్’ చెప్పేవాళ్లు చాలామంది తయారయ్యారు.
వాట్సాపుల్లో ఇవే తిరుగుతుంటాయి రోజూ. పూరి సినిమాల్లాగే ఈ మాటలు కూడా జనాలకు మొహం మొత్తేస్తున్నాయి ఇప్పుడు. ఫైనాన్షియర్లు, బయ్యర్లు చేస్తున్న ఆరోపణలతో తనను జనం అపార్థం చేసుకుంటారేమో అని పూరి కవర్ చేసే ప్రయత్నం రాసిన లేఖలా ఉంది ఇది.
చివరి పేరాలో మాత్రమే విషయం ఉంది. మిగతాదంతా మెట్ట వేదాంతంలాగే అనిపించింది. పూరి తనను తాను మోటివేట్ చేసుకోవడానికి పైదంతా రాసినట్లుగా ఉంది. వాస్తవం ఏంటంటే.. ‘లైగర్’ సినిమాను కొన్న బయ్యర్లకు మూడో వంతు కూడా వెనక్కి రాలేదు. అలా అని నష్టపోయిన బయ్యర్లకు సెటిల్ చేయాలన్న రూల్ ఏమీ లేదు.
లాభాలు వచ్చినపుడు నిర్మాతకు పంచుతారా.. మరి నష్టాలు వచ్చినపుడు ఎందుకు భర్తీ చేయాలనే ప్రశ్నను నిర్మాతలు సంధిస్తుంటారు. కానీ ఇండస్ట్రీలో అంతా పరస్పర సహకారం మీద నడుస్తుంటుంది. నష్టాలు భారీగా ఉన్నపుడు తమకు రావాల్సింది వచ్చేసిందని, తాము సేఫ్ అని నిర్మాతలు ఊరికే ఉండిపోలేరు.
బయ్యర్ల కష్టాన్ని, నష్టాన్ని పంచుకుంటారు. రేపు అవసరమైనపుడు బయ్యర్ల నుంచి కూడా సహకారం అందుతుంది. మరి ఈ అనధికార ఒప్పందం ప్రకారం బయ్యర్లను పూరి ఆదుకుంటాడా లేదా అన్నదే ఇప్పుడు చర్చ.