రాబోయే ఎన్నికల్లో పొత్తుల విషయం ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పొత్తుల విషయంలో తన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని పవన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. పొత్తులపై మొదటి ఆప్షన్ బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమని పవన్ చెప్పారు.
ఇక, రెండోది జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం అని, మూడోది జనసేన ఒక్కటే సింగిల్ గా ప్రభుత్వాన్ని స్థాపించడమని పవన్ చేసిన కామెంట్లపై తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. అయితే, ఆల్రెడీ బీజేపీతో అధికారికంగా పొత్తులో ఉన్న పవన్….ఆ పార్టీతో సంబంధం లేకుండా టీడీపీని కూడా తమతో కలుపుకుంటామంటూ పొత్తుకు ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. అంతేకాదు, 2014లో తాను తగ్గి టీడీపీని గెలిపించానని, 2024లో టీడీపీ తగ్గితే ఈ పొత్తు ముందుకు వెళుతుందని పవన్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే పవన్ కామెంట్లపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్పందించారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని, జనసేన, బీజేపీల మధ్య చక్కని సమన్వయం ఉందని ఆమె అన్నారు. అయితే 2024 ఎన్నికల నాటికి ఇతర పార్టీలతోనూ పొత్తు పెట్టుకునే విషయంపై బీజేపీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏపీలో బీజేపీని ప్రజలు దీవించాలని, రాష్ట్రానికి బీజేపీ అండగా నిలుస్తుందని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని వైసీపీ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.
అంతకుముందు, మంగళగిరిలో జరిగిన జనసేన నేతల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2014లో తగ్గాను.. 2019లో ఒక ప్రకటన ఇవ్వడానికి తగ్గాను…2024లో మాత్రం తగ్గడానికి సిద్ధంగా లేను. టీడీపీ నాయకులకు ఒకటే చెబుతున్నా. బైబిల్ సూక్తిని మీరు పాటించండి. ఈసారి ప్రజలు గెలవాలని కోరుకుంటున్నా. పొత్తులపై నేనిప్పుడు మాట్లాడిన మాటలను పార్టీ నాయకులు తేలిగ్గానే తీసుకోవాలి’ అని పవన్ అన్నారు.
ఇక, గతంలో చంద్రబాబు చెప్పినట్టు ఒకప్పుడు వన్ సైడ్ లవ్ అయిందని, ఇప్పుడు వార్ వన్‌సైడ్ అయిందని, వాళ్లు ఏ మాటమీద నిలబడతారో వారికి క్లారిటీ వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడుకుందామని పవన్ చెప్పారు. పొత్తులనేవి ఒక్క జనసేన చేతిలోనే లేవని, మిగతా పార్టీల చేతిలో కూడా ఉంటాయని, ఎలా జరుగుతాయో చూద్దామని అన్నారు.