సీఎం జగన్ పై బీజేపీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి షాకింగ్ కామెంట్లు చేశారు. రాష్ట్రాన్ని జగన్ కక్షతో పాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో పరిస్థితి శ్రీలంకను తలపించేలా ఉందని, రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించలేదని కొందరు ఆరోపిస్తున్నారని, కానీ, అది అబద్ధమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం చాలా సహకరించిందని చిన్నమ్మ చెప్పారు. జగన్ వైఖరి వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కరువయ్యాయని విమర్శించారు.
జగన్ పాలనలో ప్రజలు, ప్రతిపక్షాలు నోరు విప్పే పరిస్థితి లేదని, ప్రజలు తమ కష్టాలను సోషల్ మీడియాలో చెప్పుకునే దుస్థితి ఏపీలో మాత్రమే ఉందని అన్నారు. ఏపీలోని సమస్యలపై బీజేపీ ఎప్పటికప్పుడు ఆందోళనలు చేస్తూనే ఉందని అన్నారు. ఏపీలో మద్య నిషేధం తెస్తామని చెప్పిన జగన్…లిక్కర్ రేట్లు పెంచేసి మద్యాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్నారని ఆమె ఆరోపించారు. అప్పులు, ఉచిత పథకాలతో ఏపీని జగన్ మరో శ్రీలంకలా మార్చేసే అవకాశముందని అన్నారు. రాష్ట్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కేసుల విషయంలో జగన్కు బీజేపీ సహకరిస్తోందన్న ఆరోపణలలో వాస్తవం లేదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.
ఏపీలో పొత్తుల గురించి బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుందని, అది తమ పని కాదని చెప్పారు. జనసేనతో పొత్తు మాత్రం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలన్నది జాతీయ విధానంలో భాగంగా తీసుకున్న నిర్ణయమని ఆమె చెప్పారు. మరి, జగన్ పై పురంధేశ్వరి చేసిన కామెంట్లకు వైసీపీ నేతల స్పందన ఏమిటన్ని ఆసక్తికరంగా మారింది.