తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తొలగించబోతున్నరని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ బదులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ చీఫ్ గా నియమించబోతున్నారని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజును తొలగించడం కూడా ఖాయమని, అయితే, ఆ పదవి బీజేపీ నేత సత్యకుమార్ కు దక్కే అవకాశముందని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏపీ బీజేపీ చీఫ్ గా మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ హై కమాండ్ నియమించింది.
ఈ రేసులో చివరిగా వచ్చిన చిన్నమ్మ కీలక పదవిని దక్కించుకుంది. కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లుగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తూ అధికారిక ప్రకటనను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేయగా…ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ సోము వీర్రాజుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరిల పేర్లు కూడా వినిపించినా ఊహించని విధంగా పురందేశ్వరిని ఆ పదవి వరించింది.
ఇక, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ పడ్డారని ప్రచారం జరిగింది. ఆ పదవి దక్కకుంటే మోడీకి జేపీ నడ్డాపై ఫిర్యాదు చేస్తానని రఘునందన్ అల్టిమేటం ఇచ్చారని పుకార్లు వచ్చాయి. అయితే, తాను అలా అనలేదని ఆ వ్యాఖ్యలను రఘునందన్ ఖండించారు. తాను బిజెపికి విధేయుడినని, అటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన వివరణనిచ్చారు. కాగా, సోము వీర్రాజుకు రాష్ట్ర స్థాయిలోనే వేరే బాధ్యతలిస్తారని తెలుస్తోంది. బండి సంజయ్ కు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందా లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవి ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది.