విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా చూడటంలో బీజేపీ నేతలు చేతులెత్తేశారు. ఈ విషయం కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశంలో స్పష్టంగా అర్ధమైపోయింది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళనను ఆమె తప్పుపట్టడమే విచిత్రంగా ఉంది. మళ్ళీ ఇదే సమయంలో ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల, మనోభావాలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పటమే విడ్డూరం.
పార్టీ, మీడియా, ప్రజల మనోభావాలను కేంద్రం దృష్టికి తీసుకెళితే ఏమవుతుంది ? మోడి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా ? లేదా పరిశీలిస్తారా ? రెండింటిలో ఏదీ జరగదన్న విషయం పురందేశ్వరితో పాటు అందరికీ తెలుసు. ఆందోళనను వ్యతిరేకించలేక అలాగే కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా సమర్ధించలేక పురందేశ్వరి నానా అవస్తలు పడ్డారు. ఓ ప్రశ్నకు పురందేశ్వరి సమాధానమిస్తు ఎంఎల్సీ మాధవ్ ఇదే పనిమీద ఢిల్లీలో రెండు రోజులున్నారు అని అచెప్పారు. మరి రెండు రోజులు ఢిల్లీలో ఉన్న మాధవ్ ఏమి సాధించారంటే సమాధానం చెప్పలేదు.
స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా నరేంద్రమోడి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందనటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఆ ప్రశ్న వేసిన రిపోర్టరును తన ఆరోపణను విత్ డ్రా చేసుకోమనటం విచిత్రంగా ఉంది. ప్రత్యేకహోదా విషయంలో మోడి సర్కార్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందనటంలో రెండో మాటేలేదు. మోడి ప్రభుత్వం ఏర్పడగానే 2014లో ప్రత్యేకహోదా సాధించినందుకు అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విశాఖపట్నం, విజయవాడలో భారీ ఎత్తున పౌరసన్మానం చేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే.
అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే ఉక్కు పరిశ్రమకు సొంతంగా ఇనుపగనులు లేకపోవటానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని చెప్పటం. ఇదే యూపీఏ హయాంలో పురందేశ్వరి రెండుసార్లు ఎంపిగా గెలిచారు. చివరి ఐదేళ్ళు కేంద్రమంత్రిగా కూడా ఉన్నారు. అంటే యూపీఏ ఫెయిల్యూర్లో తాను కూడా భాగమే అని పురందేశ్వరి మరచిపోయినట్లున్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు చూస్తుంటే బీజేపీ నేతలు చేతులెత్తేసినట్లే ఉంది. కాకపోతే జనాలను మభ్యపెట్టడం కోసం కతలు చెబుతుంటారంతే.