గోదావరి జిల్లాల్లో వర్షాకాలం ప్రారంభమయ్యిందంటే పులస చేపలకు ఎక్కడ లేని గిరాకీ వచ్చేస్తుంది. పులస తినేందుకు మాంసాహారులు ఎంత ధర పెట్టడానికైనా వెనుకాడరు.. అంత క్రేజ్ ఉన్న పులసలు భారతదేశంలో ఒక్క గోదావరి జిల్లాలకే సొంతం. కేవలం ఏడాదిలో రెండు నెలలు మాత్రమే ఈ చేపలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
ఆ సీజన్లో పులసలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.. కానీ దీని ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. డిమాండ్‌ను బట్టి కిలో రూ.1500 నుంచి రూ.4,000 వరకు ఉంటుంది. ఒక్కసారి ఈ పులస పులుసు తిన్నవారు జీవితంలో మర్చిపోలేరు. ‘‘ పుస్తెలమ్మి అయినా పులస పులుసు తినాలని’’ గోదావరి జిల్లాల్లో నానుడిగా మారిందంటే పులసకున్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.
*ఎలా పుట్టింది*
ఫసిఫిక్ మహా సముద్ర పరివాహక ప్రాంతాల్లో హిల్సా ఇలీషా అనే పేరు గల వలస జాతి చేపలు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహా సముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించి గోదావరిలోకి చేరుతాయి.. వర్షాకాలంలో గోదావరి నీరు అంతర్వేది వద్ద కలిసే సమయంలో గుడ్లుపెట్టి సంతానోత్పత్తి చేసుకుంటాయి.
సముద్రంలోని ఉప్పునీటిలో ఉండే విలస చేపలు.. గోదావరిలోకి ఎర్రనీరు రాగానే ఎదురీదుకుంటూ వశిష్ట, వైనతేయ నదీపాయల గుండా ప్రయాణిస్తూ.. వరద నీటి నురుగును తింటూ జీవిస్తుంది. ఈ నీటిలో ఎదురీదుతూ ఉండటం వల్ల విలస శరీరానికి పట్టి ఉండే ఉప్పు లవణాలు కరిగిపోయి పులసగా మారి.. ఎక్కడా లేని రుచిని సంతరించుకుంటుంది.
*అంత తేలిగ్గా చిక్కవు*
పులసలు అంత తెలిగ్గా దొరకవు.. గేలానికి, వలానికి అంత తేలిగ్గా పడ్డాయి.. ఏటి మధ్యకు వెళ్లి వలను మత్స్యకారులు ఏర్పాటు చేసుకుంటారు. వీటిని పట్టేందుకు ప్రత్యేకమైన వలను ఏర్పాటు చేస్తారు. ఇంత కష్టపడినా చేపలు పడుతుందని చెప్పలేం. అయినా ఒక్క పులస చిక్కినా పండుగేనని మత్స్యకారులు అంటూ ఉంటారు. మిగిలిన చేపలతో పోల్చితే వీటి రక్తప్రసరణ వేగంగా ఉంటుది.. అందుకే వలలో పడగానే చనిపోతాయి.. కానీ రెండు రోజుల వరకు పాడవకుండా ఉండటమే పులసల ప్రత్యేకత.
*మోసాలు ఎక్కువే*
పులసకు ఉన్న డిమాండ్ దృష్ట్యా కేటుగాళ్లు మోసాలకు పాల్పడి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. కొందరు విలసలనే పులసలుగా అంటగడతారు. ఇలా వినియోగదారులు మోసపోకుండా కొన్ని చిట్కాలను చెబుతున్నారు మత్స్యకారులు.. విలసలు తెలపురంగులో ఉంటాయి.. పులస చేపలు సగం తెలుపు.. సగం గోధుమ రంగులో ఉంటాయి.. పులసను కోసినప్పుడు చక్రాకారంలో ఉంటాయి.. మిగిలిన ఏ చేపకు వలయాకారాలు ఉండవు..
గ్యాస్ స్టవ్‌ల మీద వండితే పులసలకు ఏ మాత్రం రుచి ఉండదు.. వీటిని కట్టెల పొయ్యి మీద నేర్పుగా వండాలి.. ఇందుకు చింత పుల్లనే వంటచెరుకుగా వినియోగిస్తారు.
Comments 1