ఏపీ సీఎం జగన్ తాడేపల్లి పిల్లి అంటూ.. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తుంటారు. కానీ, ఆయన తాడేపల్లిలోనే ఉంటే బాగుంటుందని దాదాపు అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో సీఎం హోదాలో జగన్ ఎక్కడకు వచ్చినా.. ఆ ప్రాంతంలో వ్యాపారాలు, విద్యాసంస్థలు అన్నీ బంద్. దీంతో వ్యాపారాలపై ఆధారపడిన సాధారణ ప్రజలు, పనులు చేసుకుని బతికే వారు కూడా సీఎం జగన్ తమ ప్రాంతానికి వస్తున్నారంటే హడలి పోతున్నారు. ఇక, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం పట్ల విద్యార్థుల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల చదువులు ఎక్కడ నాశనం అవుతాయోనని బెంగపెట్టుకుంటున్నారు.
దీంతో సీఎం జగన్ తాడేపల్లిలో ఉంటేనే బెటర్ అనే టాక్ వినిపిస్తోంది. గత రెండున్నరేళ్లలో అంటే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సీఎం జగన్ ఏదో ఒక కార్యక్రమం పేరుతో నెలలో రెండు సార్లు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బటన్ నొక్కుడు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయడం, వ్యాపారాలను బంద్ చేయడం, చెట్లు నరికేయడం వంటివి సర్వసాధారణంగా మారిపోయాయి. ఇక, ఇప్పుడు తాజాగా సీఎం జగన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట ప్రాంతంలో పర్యటించనున్నారు. జగనన్న కాలనీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో ఒక్క సామర్లకోటలోనే కాకుండా కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లావ్యాప్తంగా కూడా నిబంధనలు అమలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అయితే, సర్కారు తీసుకున్న సెలవు నిర్ణయంపై ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అడిగితే కారణం ఏం చెప్పాలని డీఈఓ తీరును ప్రభుత్వ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే, సభకు వచ్చే ముందు సీఎం జగన్ రోడ్డు షో నిర్వహిస్తున్నారు. దీనికి సుమారు లక్ష మందిని తరలించాలని టార్గెట్ పెట్టారు.
ఇంకేముంది.. అధికారులు ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సభకు జనం వచ్చేలా గ్రామాలు, పట్టణాల్లో మంచినీటి సరఫరా సమయాల్లో మార్పు చేశారు. గురువారం తెల్లవారు జామున 4 గంటలకు మంచినీటి కుళాయిలను వదిలి పెడతామని వలంటీర్ల ద్వారా ప్రజలకు మెసేజ్‌లు పంపారు. నీళ్లు పట్టుకున్న తర్వాత ఉదయం 6 గంటలకే సభకు రావాలని వత్తిడి చేస్తున్నారట. డ్వాక్రా సభ్యులు అందరూ సభకు రాకపోతే పథకాలు రావని హెచ్చరిస్తున్నారట.
జనాన్ని తరలించడానికి ఆరు జిల్లాల నుంచి ఏకంగా 318 ఆర్టీసీ బస్సులను సైతం ఉచితంగా ఏర్పాటు చేశారు. సో.. ఈ ఏర్పాట్లతో కాకినాడ జిల్లా ప్రజలు సీఎం ఎందుకు వస్తున్నాడురా బాబోయ్! అని తలలు పట్టుకుంటున్నారు. ఇదీ సంగతి!! ఎక్కడైనా సీఎం తమ ప్రాంతానికి రావాలని కోరుకునేవారు, రావడం లేదని విమర్శించేవారు ఉంటారు. కానీ, ఏపీలో అంతా రివర్స్ పాలన కదా!! అంటున్నారు విశ్లేషకులు.