సీమా హైదర్ గుర్తుందా ? పబ్జీ ఆటలో పరిచయం అయిన ప్రేమికుడిని వెతుక్కుంటూ ఏకంగా తన మొదటి భర్తతో కలిగిన నలుగురు పిల్లలను తీసుకుని పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చి ప్రియుడు సచిన్ ను పెళ్లి చేసుకుంది. నేపాల్ మీదుగా ఇండియా చేరుకుని నోయిడాలో ప్రియుడిని కలుసుకుంది. ఆ తర్వాత కేసులో జైలుకు వెళ్లిన ఇద్దరూ బెయిలుపై విడుదలయ్యారు. కేసు నడిచేంత వరకు వారు కలిసి ఉండేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది.
ప్రస్తుతం ఇలాంటిదే మరో ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన బ్రూక్లిన్ (30) అనే యువతికి ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన యువకుడు హిమాన్షు యాదవ్‌తో పబ్జీ ఆట ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత అది ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది.ప్రేమికుడిని కలుసుకునేందుకు ఖండాలు దాటి బ్రూక్లిన్ ఇండియాకు వచ్చి ఛండీగఢ్ చేరుకుంది. ఆమెను కలుసుకున్న హిమాన్షు అక్కడే పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు అక్కడే ఉండి ఆ తర్వాత ఇటావా చేరుకున్నారు.
విదేశీ యువతితో వచ్చిన హిమాన్షును చూసి అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భయపడి ఇద్దరూ తిరిగి చండీగఢ్ వెళ్లేందుకు బస్సెక్కారు. అయితే, అప్పటికే బస్సు డ్రైవర్‌కు పోలీసుల నుంచి సమాచారం అందడంతో అతడు బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ ముందు ఆపాడు. హిమాన్షు, బ్రూక్లిన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ విషయంలో యువకుడి తప్పిదం ఏమీ లేదని, యువతి పూర్తి అంగీకారంతో వారి వివాహం జరిగిందని, ఇద్దరూ కలిసి చండీగఢ్ వెళ్లాలనుకోవడం కూడా ఆమె నిర్ణయమేనని తెలుసుకున్నారు. దీంతో ఈ ప్రేమ కథ సుఖాంతమైంది.