టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, టిడిపి అగ్రనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నరసాపురంలోకి ప్రవేశించిన సందర్భంగా జోరు వానలో కూడా ఘన స్వాగతం లభించింది. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, నర్సాపురం టిడిపి ఇన్చార్జ్ కొత్తూరు రామాంజనేయులు, టిడిపి నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే వెంప గ్రామంలో 2,800 కిలోమీటర్ల మైలురాయిని లోకేష్ చేరుకున్న సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసాపురంలోని క్షత్రియులతో లోకేష్ ముఖాముఖి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా యువగళంపై దాడి, జగన్ పాలనపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ 51 నెలల పాలనలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, దివాలా కోరు సీఎం మొహం చూసి కాంట్రాక్టర్లు పరారవుతున్నారని లోకేష్ మండిపడ్డారు. పక్కా పథకం ప్రకారమే పాదయాత్రపై వైసీపీ మూకలు రాళ్లు, సోడాబుడ్లతో దాడి చేశాయని ఆరోపించారు. చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, పల్నాడు జిల్లాలలో పాదయాత్ర ప్రశాంతంగా సాగిందని, భీమవరంలో మాత్రం గొడవలు రేపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. శాసనసభ సాక్షిగా జగన్ తల్లిని తాను ఏనాడు అవమానించలేదని, పోలీసులను ప్రభుత్వం బకరాలను చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కోసం నరసాపురం వచ్చినప్పుడు కూడా దాడి జరిగిందని, ఇప్పుడు కూడా తనపై దాడి జరిగిందని అన్నారు. వైసిపి కార్యకర్త తన బైక్ తెచ్చి తమ లైవ్ బైక్ ముందు పెట్టాడని, అటువంటప్పుడు ఏం చేయాలి అని లోకేష్ ప్రశ్నించారు. జగన్ 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఒక్క దాడి జరగలేదని, కార్యకర్తలను ఏనాడు ఇబ్బంది పెట్టలేదని అన్నారు. లోకేష్, జగన్, శాశ్వతం కాదని రాష్ట్రం శాశ్వతం అని, ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు తేవడం కష్టమని, వెనుకబడిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడం అంత సులువు కాదని అన్నారు.
ఏపీని సైకో జగన్ మరో బీహార్ లా మారుస్తున్నాడని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాడని ఆరోపించారు. సైకో జగన్ ను తాడేపల్లి కొంపలో పెట్టి తాళం వేయాలని మండిపడ్డారు. ఒకరిని తీసుకెళ్తే 100 మంది వెళ్లాలని, వంద మందిని తీసుకెళ్తే 1000 మంది వెళ్ళాలని, అప్పుడే ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని లోకేష్ అన్నారు. మిథున్ రెడ్డి గోదావరి జిల్లాలకు వచ్చాడని, తిప్పికొట్టకపోతే పుంగనూరులో ఘటనలు అన్ని జిల్లాలలో జరుగుతాయని మండిపడ్డారు.