జాబ్ లెస్ క్యాలెండర్ తో నిరుద్యోగులను జగన్ మోసం చేశారని విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటిని, సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. జగన్ కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. టీడీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో, జగన్ నివాసం పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ఈ నేపథ్యంలో విజయవాడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ప్రతినిధుల ఫోన్లు లాక్కొని వారిని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. పలువురు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్లు చేయడంపై విపక్ష నేతలు, విద్యార్థి సంఘం నేతలు మండిపడుతున్నారు.
మరోవైపు, పోలీసుల తీరుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. నల్లపాడు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.విద్యార్ది సంఘాల నేతలను పరామర్శించేందుకు వచ్చిన ఆనందబాబును పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసుల తీరుకు నిరసనగా నక్కా ఆనంద బాబు, పిల్లి మాణిక్యరావు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలని, జాబ్ల కోసం నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు