ఏపీలో అధికార పార్టీ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. జనం నాడి తెలుసుకోవాలని, జనానికి మరింత చేరువ కావాలని తన ఎమ్మెల్యేలకు జగన్ హుకుం జారీ చేశారు. తన పథకాలకు జనం జేజేలు పలికారని,కాబట్టి ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం లభిస్తుందని జగన్ అనుకున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. జనం గడప తొక్కుతున్న ఆ పార్టీ నేతలకు ప్రతి గడపలోనూ నిరసన వ్యక్తమవుతోంది.
చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మాజీ మంత్రులు, తాజా మంత్రులు, ఎమ్మెల్యేలు…ఇలా తమ గడప తొక్కిన వైసీపీ నేతలకు జనం చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్)కు ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు షాకిచ్చారు. ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్ అవంతి శ్రీనివాస్ ను జనం రౌండప్ చేసి ప్రశ్నల వర్షం కురిపించారు.
‘‘ఏదో కార్యక్రమం పేరిట వస్తారు, వెళతారు.. మరి సమస్యలు పరిష్కరించేదెవరు?’’ అంటూ అవంతిని ఓ మహిళ గట్టిగా నిలదీయడంతో ఆయన అవాక్కయ్యారు. ఆ మహిళ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవంతి అవస్థపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో ఈ కార్యక్రమం సందర్భంగా అధికారులపై డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ఎవరిస్తున్నారంటూ లబ్ధిదారులను మంత్రి రాజన్న దొర అడిగారు. అయితే, తమకు పథకాలు వాలంటీర్ ఇస్తున్నాడంటూ లబ్ధిదారులు సమాధానమివ్వడంతో మంత్రి గారికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో, అధికారులపై రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో పథకాలు ఎవరిస్తున్నారంటే టీడీపీ హయాంలో చంద్రబాబు పేరు వినిపించేదని, అదే మాదిరి ఇప్పుడు పథకాలను జగన్ ఇస్తున్నారని చెప్పాలని మంత్రిగారు హుకుం జారీ చేశారు. లబ్ధిదారులు పదేపదే వాలంటీర్ల పేర్లు ప్రస్తావిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ఇంకొక సారి లబ్ధిదారుల నోటి నుంచి వాలంటీర్ అనే పదం వినిపిస్తే సస్పెండ్ చేయిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు.