కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సోషల్ మీడియాలో తన గురించి, ప్రముఖ హీరో.. డార్లింగ్ ప్రభాస్ గురించి వచ్చిన వ్యాఖ్యలు, పోస్టులపై ఆమె స్పందించారు. తనకు ప్రభాస్‌కు మధ్య ఎలాంటి రిలేషన్ లేదన్నారు. ఈ విషయం తెలిసి కూడా.. వైసీపీ సానుభూతి పరులు.. కొందరు సోషల్ మీడియాలో వికృత ప్రచారం చేశారని దుయ్యబట్టారు. పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా అంటూ ఆమె స్పందించారు.
ప్రభాస్‌ను తాను నేరుగా ఎప్పుడు చూడను కూడా చూడలేదని షర్మిల వ్యాఖ్యానించారు. అలాంటి తనపై వైసీపీ సోషల్ మీడియాలోనే ప్రచారం చేశారని.. ఈ విషయం తెలిసి కూడా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నాడని ప్రశ్నించారు. తాజాగా తనకు సంబంధించిన ఓ పాత వీడియోను మీడియాకు చూపించి సానుభూతి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నట్టు షర్మిల ఆరోపించారు. బాలకృష్ణ ఇంటి నుంచే తనపై సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందన్న విషయం జగన్ కు తెలిసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని ప్రశ్నించారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్.. తనపై విమర్శలు చేసిన వారిని.. సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన వారిని ఎందుకు వదిలి పెట్టారని నిలదీశారు. ఇవన్నీ రాజకీయాల కోసం చేస్తున్నవేనని షర్మిల దుయ్యబట్టారు. జగన్ తన రాజకీయ స్వార్థం కోసంఎంతకైనా దిగజారతాడన్నారు. ఈ క్రమంలోనే కన్నతల్లిపై కేసు వేసి కోర్టుకు లాగుతాడని.. కన్న తండ్రిని కూడా అక్రమ కేసుల ఛార్జిషీట్లలో పేరు చేరుస్తాడని నిప్పులు చెరిగారు.
రాజకీయ అవినీతి, స్వార్థ పరుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మాత్రమేనని తేల్చి చెప్పారు. అమెరి కా వరకు అవినీతి ని పారించిన ఘనుడు కూడా జగనేనని చెప్పారు. ఇలాంటివారు రాజకీయాలకు అవసరమా? అని ప్రశ్నించారు. ప్రజలు ఈవిషయం తెలుసుకోవాలని సూచించారు.