జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రంపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి అంబటి రాంబాబు సంచలన విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. బ్రో సినిమాకు పవన్ ఎంత డబ్బులు తీసుకున్నారో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. ఆ చిత్ర నిర్మాత విదేశాల నుంచి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి పవన్ కు రెమ్యునరేషన్ ఇచ్చారని అంబటి రాంబాబు షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇక, ఇదంతా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగింది అని, ఆ ప్యాకేజీని రెమ్యునరేషన్ లా ఇప్పించారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే అంబటి ఆరోపణలపై చిత్ర నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ స్పందించారు. అంబటి రాంబాబు ఆరోపణలను ఆయన ఖండించారు. అమెరికా నుంచి భారత్ కు బ్లాక్ మనీ తీసుకురావడం అసాధ్యమని, అక్కడి నుంచి ఇక్కడికి డబ్బు తెచ్చేందుకు ఆర్బీఐ కఠిన నిబంధనలు విధించిందని చెప్పారు. పవన్ కు ఎంత ఇచ్చాం అనేది ప్రపంచంలో ఎవరికీ చెప్పాల్సిన అవసరం తమకు లేదని క్లారిటీ ఇచ్చారు.
ఐటీ రిటర్న్స్ కట్టేటప్పుడు ఎంత తీసుకున్నారో పవన్ లెక్క చెప్పుకుంటారని, తమ సంస్థ ఆదాయపు పన్ను చెల్లించే సమయంలో సినిమాకు ఎంత బడ్జెట్ అయింది అనేది తాము చూసుకుంటామని కౌంటర్ ఇచ్చారు. ఇక, ఈ సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ తో అంబటి రాంబాబుకు సంబంధం లేదని, డ్రెస్ ఒకటే మ్యాచ్ అయిందని చెప్పుకొచ్చారు. అయినా, శ్యాంబాబు క్యారెక్టర్ నెగిటివ్ గా ఏమీ కనిపించలేదని, క్రియేటివ్ గానే ఆ క్యారెక్టర్ పెట్టామని చెప్పారు.
ఇక, ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ మేనల్లుడు యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా స్పందించారు. అంబటి రాంబాబుపై జోకులు వేసేలాగా ఆ డాన్స్ సీన్ తీయలేదని తేజూ క్లారిటీనిచ్చాడు. సినిమాలకు, రాజకీయాలకు ముడి పెట్టొద్దని, సినిమాను సినిమాగానే చూడాలని హితవు పలికారు. తనకు రాజకీయ అనుభవం లేదని, కానీ తమ కుటుంబమంతా పవన్ కే సపోర్ట్ చేస్తామని చెప్పాడు. చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నాడు.