టాలీవుడ్ యువ నిర్మాత నాగవంశీ పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఇంటర్వ్యూల్లో భాగంగా చేస్తున్న వ్యాఖ్యల మీద తరచుగా వివాదం రేగుతోంది. టికెట్ల ధరల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఎంతగా దుమారం రేపాయో తెలిసిందే. అలాగే పెద్ద హీరోల సినిమాల్లో కథ తొక్క తోలూ ఏమీ అవసరం లేదని.. హీరో ఎలివేషన్లు, పాటలు, కామెడీ ఉంటే చాలని ఆయన చేసిన మరో కామెంట్ కూడా విమర్శలకు దారి తీసింది.
దీంతో పాటు నాగవంశీ ఇటీవల మరో ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ మీద కొత్త వివాదం నడుస్తోంది. సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుతూ.. ఈసారి పెద్దగా పోటీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. తన ప్రొడక్షన్లో బాలకృష్ణ హీరోగా బాబీ రూపొందిస్తున్న చిత్రాన్ని సంక్రాంతి రేసులో నిలిపిన నేపథ్యంలో పండక్కి పోటీ ఎక్కువ ఉంటుంది కదా అని అడిగితే.. ఈసారి పోటీ పెద్దగా ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
ఐతే రామ్ చరణ్-శంకర్ల క్రేజీ కాంబినేషన్లో రానున్న ‘గేమ్ చేంజర్’ సంక్రాంతికి షెడ్యూల్ అయిన విషయం తెలిసి కూడా పెద్దగా పోటీ ఉండదని నాగవంశీ వ్యాఖ్యానించడంతో మెగా ఫ్యాన్స్ హర్టయ్యారు.
‘గేమ్ చేంజర్’ను తీసి పడేసేలా మాట్లాడాడని.. ఆ సినిమా తమ మూవీకి పోటీ కాదన్నట్లు వ్యాఖ్యానించడం అంటే అహంకారమే అని నాగవంశీని ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగవంశీ స్పందించాడు. ‘‘సంక్రాంతికి ఐదారు సినిమాలు వస్తాయి కదా. పోటీ ఎక్కువ ఉంటుంది కదా అని అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. ఈసారి అన్ని సినిమాలు రావు. వచ్చినా పెద్దగా పోటీ ఉండదు అని వ్యాఖ్యానించాను. ఆ కామెంట్‌ను సోషల్ మీడియాలో వక్రీకరించారు. గేమ్ చేంజర్ సంక్రాంతికి వచ్చినా తమ సినిమాకు పోటీ కాదని నేను అన్నట్లు క్రియేుట్ చేశారు.
ఇందులో ఏమైనా అర్థముందా? ఈసారి ఆరు కాకుండా మూడు సినిమాలే సంక్రాంతికి వస్తాయన్న ఉద్దేశంతో పోటీ ఉ:డదన్నాను. పండక్కి మూడు సినిమాలు రావడం మామూలే. ఒక నిర్మాతగా నేను ఇంకో సినిమా హిట్ కాకూడదని కోరుకుంటానా? వేరే చిత్రాన్ని తక్కువ చేసి మాట్లాడతానా? రేప్పొద్దున నేను కూడా ఆ హీరోతో పని చేయాల్సి ఉంటుందనే విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోరు’’ అని నాగవంశీ ప్రశ్నించాడు.