తెలంగాణలో రాజకీయం రగులుకుంటుంది. మరో నాలుగు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల హడావుడి మొదలైంది. తెలంగాణను ఇవ్వటం ద్వారా దశాబ్దాల కలను నెరవేర్చిన తమకు రాజ్యాధికారం దక్కని వైనాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తిరుగులేని అధికారాన్ని చెలాయించిన ఆ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం చేస్తున్న పోరు అంతా ఇంతా కాదు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలను పక్కన పెట్టి.. తమ ప్రత్యర్థి అయిన కేసీఆర్ మీద ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయటం షురూ చేసింది. ఈ రోజు (సోమవారం) సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ముఖ్య అతిధిగా భారీ కార్యక్రమానికి తెర తీశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ సభకు యువ సంఘర్షణ పేరు పెట్టారు. విద్యార్థి.. నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కారు.. విద్యార్థి.. యువత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలో.. వారిని ఆకర్షించే నినాదాలతో కాంగ్రెస్ తెర మీదకు వచ్చింది.
తెలంగాణలో ప్రియాంక పాల్గొంటున్న తొలి సభ కావటంతో.. ఈ సభను భారీ ఎత్తున నిర్వహించాలని టీపీసీసీ భావిస్తోంది. ఇందులో భాగంగా భారీగా ఏర్పాట్లు చేశారు. తాము అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తామన్న అంశాన్ని ఆమె హామీ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా యూత్ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎజెండాగా ఫిక్సు చేసే వాటిల్లో తాము తెర మీదకు తీసుకొచ్చే యూత్ డిక్లరేషన్ కీలకమవుతుందన్న మాట కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది.
ప్రియాంక ప్రకటించనున్నయూత్ డిక్లరేషన్ లోని కీలక అంశాల్ని చూస్తే.. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతిని ప్రకటించనున్నారు. అంతేకాదు ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనున్నారు. వీటితో పాటు తాము అధికారంలోకి వస్తే యువతకు ఏమేం అవకాశాలు కల్పిస్తామన్న అంశం మీద ప్రత్యేక కార్యాచరణను ప్రకటిస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ తెర మీదకు తీసుకురానున్న యూత్ డిక్లరేషన్ బాటలో మిగిలిన రాజకీయ పార్టీలు నడిచే వీలుందన్న మాట వినిపిస్తోంది.