బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా, పాప్ సింగర్ నిక్ జొనాస్ ల జంట ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తనకంటే చిన్నవాడైన నిక్ ను పీసీ పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరి గురించి ఒక పుకారు షికారు చేస్తోంది. నిక్ తో ప్రియాంకా చోప్రా తెగదెంపులు చేసుకోబోతోందని బాలీవుడ్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుంచి ‘చోప్రా జొనాస్’ పేరును ప్రియాంకా తొలగించడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది.
కేవలం ప్రియాంక పేరు తోనే ఆమె సోషల్ మీడియా ఖాతాలు దర్శనమివ్వడంపై నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ విడిపోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు. ప్రియాంకా, నిక్ లు విడిపోతున్నారని వస్తున్నవన్నీ చెత్త వార్తలని, ఉత్త పుకార్లు అని స్పష్టం చేశారు.
ఈ వార్తలను ప్రియాంక స్నేహితురాలు కూడా కొట్టిపడేశారు. ప్రియాంకా భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల కోసం పేరు మార్చుకుందని, జొనాస్ తో పాటు ‘చోప్రా’ పేరును కూడా తొలగించిందని గుర్తుచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడిపోయిన టాలీవుడ్ స్వీట్ కపుల్ సమంత-నాగచైతన్యల తరహాలోనే ప్రియాంకా, నిక్ వెళుతున్నారని అంటున్నారు. విడిపోవడానికి ముందు సమంత కూడా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి అక్కినేని పేరును తొలగించినట్లే ప్రియాంక కూడా తొలగిస్తోందని చెబుతున్నారు.