ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతునన నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. కరోనా తీవ్రత, నియంత్రణ చర్యల కోసం కేబినెట్ అత్యవసర భేటీకి కేసీఆర్ రెడీ అవుతున్నారు. కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూతోపాటు పలు కఠినమైన ఆంక్షలను విధించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో విద్యాసంస్థలకు ఇచ్చిన సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు కేసీఆర్ సర్కార్ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా కట్టడికి స్యూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం బార్లు, వైన్ షాపులు, పబ్బులు వంటి వాటిపై ఆంక్షలు విధించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సూపర్ మార్కెట్స్, కూరగాయల, చేపల మార్కెట్లు, సినిమా థియేటర్స్, మాల్స్, రాజకీయ సమూహాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శిస్తున్నారు.
అవగాహనా ఉండి అన్ని జాగ్రత్తలు పాటించే విద్యాసంస్థలను మూసివేస్తే పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళు, పాఠశాలల విషయంలో తీసుకున్న జాగ్రత్తలే మిగతా జనసమూహాలు తిరిగే చోట తీసుకోవాలని కొందరు తల్లిదండ్రులు, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. సెలవుల పొడిగింపు ప్రకటనను ట్రస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్-TRSMA) తీవ్రంగా ఖండించింది. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది.