`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ హిట్ అనంతరం దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును లాక్ చేసిన సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్ తో కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపిక అయింది. అటవీ నేపథ్యంలో సాగే కథతో రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
ప్రస్తుతం కెన్యాలో షూటింగ్ కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మహేశ్, రాజమౌళి మూవీలో విలన్ గా మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంపిక అయినట్లు కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించాడు. `ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. అన్ని ఫైనల్ అయ్యాక మాట్లాడతాను` అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. అంటే మహేశ్ మూవీ కోసం పృథ్వీరాజ్ తో రాజమౌళి సంప్రదింపులు జరపడం వాస్తవమే. కానీ ఆయన ఓకే చేశారా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
అయితే ఇదే తరుణంలో మరో వార్త కూడా బయటకు వచ్చింది. మహేశ్ – రాజమౌళి మూవీలో ప్రతినాయకుడి పాత్రను బాలీవుడ్ బ్యాడ్ బాయ్ జాన్ అబ్రహం పోషించబోతున్నాడని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ నో చెప్పడంతో.. ఆయన ప్లేస్ ను జాన్ అబ్రహంతో రీప్లేస్ చేస్తున్నారట జక్కన్న. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.