బెజవాడ కొండపై కొలువైన కనకదుర్గమ్మను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు భక్తిశ్రద్ధలతో కొలుస్తుంటారు. ముఖ్యంగా విజయదశమి సందర్భంగా జరిగే దేవీ నవరాత్రుల కోసం ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశంలోని పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తుంటారు. దేవీ నవరాత్రుల సందర్భంగా వివిధ రూపాలలో దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకొని తమను కరుణించాలని వేడుకుంటూ ఉంటారు. దీంతో, దేవీ నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయం వద్ద భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుంది.
ఈ క్రమంలో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు కూడా అదనపు బలగాలని మోహరిస్తుంటారు. అయితే, భక్తులను అదుపు చేయాల్సిన పోలీసులు ఆలయంలో పూజలు చేసేందుకు వెళుతున్న అర్చకులను కూడా అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమకు డ్యూటీ కార్డు ఉందని, ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్తున్నామని చెప్పినా సరే పోలీసులు సాధారణ అర్చకులను అడ్డుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఆలయ స్థానాచార్యులను, ప్రధాన అర్చకులను కూడా ఐడి కార్డు చూపిస్తేనే అనుమతించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు అర్చకులను పోలీసులు అడ్డుకోవడంతో వారు వాగ్వాదానికి దిగారు. డ్యూటీ కార్డు చూపించినా సరే అడ్డుకున్నారని వాపోయారు. ఈవో ఆదేశాల ప్రకారమే ఇలా చేస్తున్నామని పోలీసులు చెబుతున్నట్టుగా అర్చకులు ఆరోపిస్తున్నారు. తాము కూడా అమ్మవారికి సేవ చేసేందుకు వచ్చామని ఐడి కార్డు చూపించినా ఎందుకు అడ్డుకుంటున్నారని అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిత్యం అమ్మవారిని పూజించే తమతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, మీకు నచ్చింది చేసుకోండి అంటూ మాట్లాడారని అర్చకులు ఆరోపిస్తున్నారు. కానీ, ఆలయ ప్రాంగణంలో పోలీసుల ఓవరాక్షన్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ ఈవో అలాంటి ఆదేశాలు జారీ చేసి ఉంటే ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భక్తులు, అర్చకులు డిమాండ్ చేస్తున్నారు.