పంతుళ్లు అంటే.. పూజారులు. ఉత్తరాంధ్రలో ఇలానే పిలుస్తారు. అందుకే.. ఈ మాటే ఇప్పుడు హాట్‌హాట్ గా సాగుతోంది. పంతుళ్లకూ పాలిటిక్స్ మప్పేస్తారా? అంటూ.. సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువలా వస్తున్నాయి. దీనికి కారణం.. పూజారులు.. తమ విధులను తాము నిర్వర్తించడమే! ఆశ్చర్యంగా ఉన్నా.. విజయనగరంలో జరిగిన ఘటన.. తర్వాత వైసీపీ సర్కారు వారి చర్యలు అంతా ఇలానే ఉన్నాయి.
ఏం జరిగిందంటే..
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు.. విజయనగరం జిల్లాలోని రామతీర్థానికి వెళ్లారు.(ఇది రెండేళ్లకిందట తీవ్ర వివాదం అయింది. రాముడివిగ్రహం తలను ఎవరో నరికేశారు. ఇది ఇప్పటికీ తేలలేదు.) అయితే.. ఆయన గౌరవార్థం.. పూజారులు.. ప్రత్యేక పూజలు చేశారు. ఐదుగురి నుంచి ఆరుగురు పూజారులు.. అశోక్ గజపతి రాజును ఆశీర్వదించారు కూడా.
అంతే.. ఇది సర్కారు వారికి కోపం తెప్పించింది. ఆవెంటనే ఆ పురోహితులకు రాజకీయాలు అంటగడు తూ.. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాదు.. స్థానిక అధికారులు అయితే.. పంతుళ్లను అనరాని మాటలు అనేశారని వినికిడి. పోయి టీడీపీ కండువా కప్పుకోవాలని కూడా ఆలయ అధికారి వ్యాఖ్యానించి నట్టు పూజారులు ఆరోపిస్తున్నారు.
అక్కడితో కూడా ఆగకుండా.. ఫక్తు పాలిటిక్స్ అంటగట్టేశారని పూజారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, ఇది రాజకీయ వివాదంగా మారిపోయింది. పంతుళ్లకు నోటీసులు ఇచ్చిన విషయం తెలుసుకున్న టీడీపీ ఫైర్ అయింది. తమతో పోరాటం చేయలేకే.. పాపం పంతుళ్లపై పడ్డారంటూ.. నెల్లిమర్ల నియోజకవర్గం నేతలు విరుచుకుపడుతున్నారు. మొత్తానికి పంతుళ్లకూ పాలిటిక్స్ మప్పించేయడం.. ఇప్పుడు వివాదంగా మారింది.