కేసీఆర్ పై ఒత్తిడి బాగా పెరిగిపోతోందట. ఎందుకంటే ఎంఎల్సీలుగా అవకాశం ఇప్పించమని. విషయం ఏమిటంటే గవర్నర్ కోటాలో ఎంఎల్సీలుగా నామినేట్ చేయమని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయాణ పేర్లను క్యాబినెట్ అప్పుడెప్పుడో సిఫారసుచేసింది. ఆ ఫైలును నెలలపాటు తన దగ్గరే అట్టిపెట్టుకున్న గవర్నర్ తమిళిసై సోమవారం రెజెక్టుచేశారు. గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ స్ధానాలకు రాజకీయ నేతలను సిఫారసు చేయవద్దని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.
దాంతో కేసీఆర్ ప్రభుత్వానికి తలబొప్పి కట్టినట్లయ్యింది. ఎప్పుడైతే ఫైలును గవర్నర్ తిప్పి పంపారో అప్పటినుండే కేసీయార్ లో ఆలోచన మొదలైంది. మరో ఇద్దరిని కొత్తగా సిఫారసుచేయాలా ? లేకపోతే పంతానికి పోయి మళ్ళీ ఈ ఇద్దరిపేర్లనే రెండోసారి పంపాలా అని. ఈ విషయంపై ఏమీ తేల్చుకోలేని పరిస్ధితులో కేసీయార్ ఉన్నారు. ఎందుకింతగా ఆలోచిస్తున్నారంటే తొందరలోనే సాధారణ ఎన్నికలు వస్తుండటమే. అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఎంఎల్సీలుగా తమ పేర్లను సిఫారసు చేయాలని చాలామంది నేతలు కేసీయార్ పై ఒత్తిడి పెంచేస్తున్నారట.
గవర్నర్ కోటాలో కళలు, విద్య, సాంస్కృతిక సాహిత్యాలు, క్రీడా రంగాల్లో వాళ్ళని మామూలుగా సిఫారసు చేస్తారు. అయితే రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రులు తమకు అవసరమైన వారినే సిఫారసు చేయటం, గవర్నర్లు కూడా ఏమీ మాట్లాడకుండా ఆమోదించేయటం రివాజుగా మారింది. అయితే ఈ పరంపరకు తమిళిసై అడ్డంపడ్డారు. అందుకనే అవకాశం వచ్చిందికదాని ఉద్యోగ సంఘాల మాజీ నేత స్వామిగౌడ్, విద్యావేత్త ఘంటా చక్రపాణి, కాలేజీల యజమాని పీఎల్ శ్రీనివాస్, సాట్స్ మాజీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, ఉస్మానియా విద్యార్ధిసంఘం నేత రాం నర్సింహగౌడ్, మాజీ ఎంఎల్సీ గంగాధర గౌడ్ లాంటి వాళ్ళు కేసీఆర్ పై బాగా ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీవర్గాల టాక్.