“మా వాళ్లు చేసిన తప్పులను సరిదిద్దే బాధ్యత మీదే!“ – ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఐఏఎస్, ఐపీఎస్ అదికారులకు చేసిన ఆదేశాలు.. ఒకదశలో దేశంలో సంచలనం రేపాయి. అప్పటి వరకు పెద్దగా ఐఏఎస్లు, ఐపీఎస్లకు రాజకీయ జోక్యం ఉండదనే చర్చ ఉండేది. కానీ, మాయావతి ఆ హద్దులు చెరిపేశారు. ఇక, ఇప్పుడు ఇదే పరిస్థితి ఏపీలోనూ కనిపిస్తోంది.
తాజాగా సీఎం జగన్ కొత్తగా ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు.. వైసీపీని తనను గెలిపించే బాధ్యత మీ భుజాలపై మోపుతున్నాను.. అని వ్యాఖ్యానించారు. అంటే.. ఎమ్మెల్సీగా రేపు ప్రమాణం చేసేవారు.. “మేము.. వైసీపీని గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తాము“ అని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. లేదా.. ప్రమాణంలో దీనిని మిళితం అయినా చేయాల్సి ఉంటుంది. ఇక, నుంచి వీరు.. ప్రజల సమస్య లు.. లేదా.. సమాజానికి సంబంధించిన విషయాలను వదిలేయాల్సి కూడా ఉంటుంది.
కన్నుమూసినా.. తెరిచినా నువ్వే.. అన్నట్టుగా.. జగన్ జపం చేయాల్సి వుంటుందన్నమాట. అయితే.. ఇక్కడ మరో కీలక విషయం కూడా చర్చకు వస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ వలంటీర్లను పార్టీకోసం వాడుకుంటున్నారు. రేపో మాపో.. గృహసారథులు అనే కాన్సెప్టును కూడా తీసుకురానున్నారు. ఇవన్నీ చాలక ఐప్యాక్ టీం ఉండనే ఉంది. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీనాయకులు ఇంటింటికీ తిరుగుతున్నారు. సో.. మొత్తంగా.. ఇవన్నీ సాగుతున్నాయి.
అయినప్పటికీ.. జగన్కు ఎక్కడో తేడా కొడుతోందనే భావన వ్యక్తమవుతోందని అంటున్నారు పరిశీలకులు. అందుకే.. ఇప్పుడు ఎమ్మెల్సీలను కూడా రంగంలోకి దింపుతున్నారని చెబుతున్నారు. ఏదేమైనా.. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు కానీ, ప్రత్యక్ష ఎన్నికలతో సంబంధం లేని ఎమ్మెల్సీలను కూడా పార్టీకోసమే వాడుకుంటానని చెప్పడం ద్వారా.. జగన్ మరింత పలుచనయ్యారని.. వైసీపీలోనే తటస్థ వర్గాలు చెబుతున్నాయి.