వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ పై కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. గోరంట్ల వీడియో ఒరిజినలో కాదో సత్వరమే తేల్చి ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు, విపక్ష పార్టీల నేతలు, పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక, ఎంపీ అయి ఉండి ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న గోరంట్ల ఇష్యూపై సాటి ఎంపీలు కూడా లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
ఇక, గోరంట్ల రచ్చ వీడియోపై రాష్ట్రపతి ముర్ముకు కూడా ఫిర్యాదు అందింది. గోరంట్లపై రాష్ట్రపతి ముర్ముకు మహిళా జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆ ఫిర్యాదుపై తాజాగా రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఏపీ సీఎస్ కు మహిళా నేతలు అందించిన ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం పంపించింది. ఆ మహిళలు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సూచించింది.
మాధవ్ పై చర్యలు తీసుకునేలా చూడాలని రాష్ట్రపతిని మహిళా జేఏసీ నేతలు కోరారు. అంతేకాదు, ఆల్రెడీ ఉప రాష్ట్రపతి, జాతీయ మహిళా కమిషన్, కేంద్రమంత్రులకు కూడా మహిళా జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మహిళా జేఏసీ ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించినట్టు మహిళా జేఏసీ కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ పంపింది.
మరోవైపు, గోరంట్ల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ నోరు మెదపకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి ఆరోపణలు వచ్చిన గోరంట్లను కనీసం తాత్కాలికంగానైనా సస్పెండ్ చేయకుండా జగన్ మీనమేషాలు లెక్కించడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కమెడియన్ పృథ్వీపై ఆడియో టేప్ ఆరోపణలు వచ్చినందుకే ఆయనను ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి ఆఘమేఘాల మీద తొలగించిన జగన్…ఇపుడు గోరంట్ల డర్టీ పిక్చర్ వైరల్ అవుతున్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.