పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన ముర్ము..బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ముర్ము ప్రస్తావించారు.
ఇప్పటికే 12 వేల కోట్ల రూపాయలను ఆ ప్రాజెక్టుకు కేటాయించామని గుర్తు చేశారు. పోలవరం సత్వర నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రైతులు, మహిళలు, పేదలు, యువతకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని చెప్పారు. ఎన్టీయే ప్రభుత్వం మూడు రెట్ల వేగంతో పని చేస్తోందని గత ప్రభుత్వాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక, వక్ఫ్ సవరణ బిల్లు అమలు దిశగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
ఒలింపిక్ పతకాలు సాధిస్తూ, కార్పొరేట్ సంస్థలకు నాయకత్వం వహిస్తూ మహిళలు దేశం గర్వించేలా చేస్తున్నారని, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు అని అన్నారు. 3 కోట్ల మందిని లక్ పతి దీదీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్ యాన్ ను భారత్ ప్రయోగించే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు.
‘భారత ఏఐ’ మిషన్ ను మొదలుపెట్టామని అన్నారు. భారత్ ను గ్లోబల్ ఇన్నొవేషన్ పవర్ హౌస్ గా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. యూపీఐ లావాదేవీల వ్యవస్థ విజయాన్ని అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రశంసించాయని గుర్తు చేశారు. ట్యాక్స్ విధానాలను సరళీకరించామని, రూ. 70 వేల కోట్లతో గ్రామీణ రహదారులు అభివృద్ధి చేశామని చెప్పారు.