2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్‌కు ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. ఆయన నేతృత్వంలోని ఐప్యాక్ తన విజయంలో కీలకంగా మారినట్లు స్వయంగా జగన్ సైతం పార్టీ వర్గాలతో బలంగా చెప్పేవారు. వేరే రాష్ట్రాల ఎన్నికల్లోనూ ప్రశాంత్ ముద్ర కనిపించడంతో ఆయన పేరు ఒక దశలో మార్మోగింది. పీకేను చూసే చాలా పార్టీలు పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌లను నియమించుకోవడం మొదలుపెట్టాయి. ఐతే ‘ఐప్యాక్’ నుంచి బయటికి వచ్చేశాక ప్రశాంత్ కిశోర్.. కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ ఓ పార్టీ కోసం వ్యూహకర్తగా మారుతున్నారు. ఆ పార్టీ.. తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ కొత్తగా ఆరంభించిన తమిళ వెట్రి కళగం కావడం విశేషం. ఈ పార్టీ కోసం పీకే పని చేస్తున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడా విషయం అధికారికంగా ఖరారైంది. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో పీకే ప్రత్యక్షమయ్యారు.
ఈ సమావేశంలో పీకే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ని గెలిపించి తమిళనాడులో అత్యంత పాపులర్ అయిన బిహారీగా మారాలని తాను అనుకుంటున్నట్లు పీకే చెప్పాడు. ఇప్పటిదాకా తమిళనాడులో మోస్ట్ పాపులర్ బిహారీ ఎం.ఎస్.ధోనీనే కదా అని టీవీకే కార్యకర్తలను పీకే అడిగాడు. ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ సూపర్ కింగ్స్‌ను చాలాసార్లు గెలిపించడం ద్వారా ధోని తమిళనాట ఎంతో పాపులారిటీ సంపాదించాడని.. ఐతే ఎన్నికల్లో విజయ్‌ని గెలిపించడం ద్వారా తమిళనాడులో ధోనిని మించి తాను పాపులర్ కావాలనుకుంటున్నట్లు పీకే చెప్పాడు.
ఈ కామెంట్స్‌తో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. విజయ్ సైతం పీకే వ్యాఖ్యలు విని నవ్వుతూ కనిపించారు. ధోనీది ఝార్ఖండ్ కదా, అతను బిహారీ అని ప్రశాంత్ అంటాడేంటి అని కొంతమందికి సందేహాలు కలగొచ్చు కానీ.. ఐతే ఒకప్పుడు ఝార్ఖండ్ బిహార్‌లో భాగం. తర్వాత కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. అయినా ఝార్ఖండ్ వాసులను సైతం బిహారీలుగానే పేర్కొంటారు.