ఇటీవల చెన్నైలో జరిగిన ‘పుష్ప-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో దేవిశ్రీ చేసిన కామెంట్స్ ఎంత కలకలం రేపాయో తెలిసిందే. ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడం కోసం దేవిశ్రీ ఉండగా.. ఇంకో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను దర్శక నిర్మాతలు ఆశ్రయించడం అతడికి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో నిర్మాతల మీద పరోక్షంగా ఫైర్ అయిపోయాడు దేవి. ‘‘మనకు కావాల్సింది ఏదైనా అడిగి తీసుకోవాలి. అది పేమెంట్ అయినా.. క్రెడిట్ అయినా’’ అంటూ అతను చేసిన కామెంట్ వైరల్ అయింది. ఈ కామెంట్‌ను ఇప్పుడు ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ వాడుకుని పంచ్ వేయడం విశేషం.
అతను పంచ్ వేసింది.. ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ మీద. ఇంతకీ ఏం జరిగింది అంటే…?
తేజ సజ్జ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌ను కలిశాడు. తనతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. రణ్వీర్ తనను ప్రశంసించడం కదిలించిందని చెప్పాడు. ‘‘ఆయన నా వర్క్ గురించి మాట్లాడిన విధానం నన్నెంతో ఆకట్టుకుంది. ఎంతో ప్రేమ చూపించారు. చిన్న విషయాలను కూడా గుర్తించి ప్రోత్సహించారు. ఇది కేవలం ప్రశంస మాత్రమే కాదు.. స్వచ్ఛమైన ప్రోత్సాహం’’ అని కామెంట్ పెట్టాడు తేజ. దీనికి ప్రశాంత్ వర్మ స్పందిస్తూ.. ‘‘ఫొటో క్రెడిట్ లేదా పుష్పా’’ అని కామెంట్ చేశాడు. తద్వారా తేజ, రణ్వీర్ ఫొటోను తనే తీశానని చెప్పకనే చెప్పాడు. దీనికి ప్రతిగా తేజ.. ‘‘వచ్చేశాడు’’ అనే ‘కృష్ణ’ సినిమాలోని బ్రహ్మానందం క్లిప్ పెట్టాడు.
ప్రశాంత్ మళ్లీ రిప్లై ఇస్తూ.. ‘‘మనకు ఏం కావాలన్నా మనమే అడిగి తీసుకోవాలి అని ఒక పెద్దాయన ఒకానొక సమయంలో చెప్పారు’’ అంటూ దేవిశ్రీ కామెంట్‌తో పంచ్ వేశాడు. ఈ సరదా సంభాషణ నెటిజన్లు ఎంతగానో ఆకట్టుకుంది. ప్రశాంత్ సోషల్ మీడియాలో పాపులరైన మీమ్ డైలాగ్స్ వాడుతూ కామెంట్లు పెట్టడం ఇది తొలిసారి కాదు. మోహన్ బాబు.. ‘‘అయ్యప్ప స్వామి సాక్షిగా’’ మాట సహా చాలా డైలాగులను ఆయన గతంలో వాడాడు.