ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ వ్యవహారం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పవన్ ను టార్గెట్ చేసిన జగన్…ఆ చిత్రం టికెట్ రేట్లు పెంచకుండా, స్పెషల్, బెనిఫిట్ షోలకు అనుమతినివ్వకుండా కక్ష సాధిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కు మద్దతుగా పలువురు రాజకీయ ప్రముఖులు జగన్ వైఖరిని తప్పుబట్టారు. కానీ, సినీ రంగం నుంచి మాత్రం పవన్ కు సరైన మద్దతు లభించలేదు.
పవన్ సోదరుడు నాగబాబు మినహా…మరెవ్వరూ పవన్ సినిమాను టార్గెట్ చేశారని విమర్శించలేదు. పవన్ కు సినీ పెద్దల మద్దతు లభించడం లేదని, పవన్ ఒంటరి అయ్యాడని నాగబాబు కూడా విమర్శించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఈ చిత్రం విషయంలో జగన్ సర్కార్ వైఖరిని ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. బాక్సాఫీస్ దగ్గర కక్ష సాధింపు ధోరణి చూపిస్తున్న ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు.
సృజన, సాంకేతికత మేళవించిన సినిమారంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటని ప్రకాష్ రాజ్ నిలదీశారు. చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ.. తామే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మడం ఎలా అని ప్రశ్నించారు. రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్థులను చూసుకోవాలని, కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకని నిలదీశారు. ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డకట్టవేయలేరని ఏపీ ప్రభుత్వ వైఖరిపై ప్రకాష్ రాజ్ మండిపడ్డారు.