ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ ప్రజాగ్రహ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. సభలో ప్రసంగించిన జగవదేకర్…జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చాలామంది నేతలు బెయిల్ పై ఉన్నారని, వారంతా త్వరలోనే జైలుకు వెళతారని షాకింగ్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో మద్య నిషేధం అన్న జగన్…ఇప్పుడు మద్యంపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీఆర్ఎస్ లది అవినీతి పాలనే అని ఆరోపించారు.
తాను కేంద్రమంత్రిగా ఉన్నపుడే పోలవరానికి అన్ని అనుమతులు వచ్చాయని, ఏడేళ్లయినా పోలవరం పూర్తిచేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి కోసం అటవీభూములను సైతం బదిలీ చేశామని, అయినా అమరావతి పూర్తి కాలేదని అన్నారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఏపీలో పరిస్థితి బాగోలేదని, అంతర్వేదిలో రథం దగ్ధమైందని, రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని విరగ్గొట్టారని మండిపడ్డారు.
అయోధ్యలో నభూతో నభవిష్యత్ అన్నరీతిలో రామాలయం నిర్మిస్తున్నామని, వారణాసి, చార్ ధామ్ వంటి పుణ్యక్షేత్రాల రూపురేఖలు మారుస్తున్నామని వెల్లడించారు. తాజాగా బెయిల్ పై ఉన్న నేతలంటూ జగన్, విజయసాయిలనుద్దేశించి జవదేకర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. జగన్ ను బీజేపీ పెద్దలు టార్గెట్ చేశారనడానికి, త్వరలోనే జగన్ జైలుకు వెళతారని చెప్పడానికి తాజాగా జవదేకర్ వ్యాఖ్యలే నిదర్శనమి ట్రోల్ చేస్తున్నారు.