ఆయన వయసు 84. కానీ ఆయన ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అలాగని ఆయన మామూలు వ్యక్తి కాదు. మధ్యప్రదేశ్‌లోని చింద్‌వాడాకు చెందిన ప్రకాశ్ ఇండియన్ టాటా ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు. మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డు నుంచి ఇంతకుముందు ఐదో తరగతి పరీక్షలు రాశారు. ప్రస్తుతం 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. భవిష్యత్తులో 10, ఇంటర్ పరీక్షలు కూడా రాస్తానని చెబుతున్నాడు.
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, శిల్పాశెట్టి సహా పలువురు సినీ ప్రముఖులు, శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య, రాజకీయ నాయకులు, ఎంతోమంది విదేశీ వ్యాపారవేత్తలకు సేవలు అందించారు. మొత్తం 112 దేశాల్లో పర్యటించి ఆయన ఆయుర్వేద వైద్యం చేయడం విశేషం.
‘విదేశాలకు వెళ్లినప్పుడు తనను ఎగతాళి చేసేవారు, అందుకే చదువుకోవాలని నిర్ణయించుకున్నా. చదువుకు వయసుతో సంబంధం లేదని భావించాను. ఇంక నా పేరు విషయానికొస్తే నేను అమర్‌కంటక్‌లోని అమృత్ ప్రసాద్ తివారీ ఆశ్రమంలో ఉన్నప్పుడు నా గురువు డాక్టర్ ప్రకాశ్ ఇండియన్ టాటా అని పిలిచేవారు. అప్పటి నుంచి అదే నా పేరుగా మారింది. జులైలో అమెరికాలోని ఓ యూనివర్సిటీ నాకు డాక్టర్ డిగ్రీ ఇవ్వనున్నారు’ అని ప్రకాశ్ తెలపడం గమనార్హం.