ప్రస్తుతం ఇండియాలో బిగ్టెస్ట్ స్టార్ అయిన ప్రభాస్.. వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఓవైపు రాజా సాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) చిత్రాల్లో నటిస్తూనే.. మరోవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ను కూడా పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇంకా ప్రభాస్ చేతిలో ఇంకా సలార్-2, కల్కి-2 సినిమాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలన్నీ పూర్తి చేయడానికి ఇంకో ఐదేళ్ల సమయం అయినా పడుతుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇంతలోనే కొత్తగా ఇంకో రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు ప్రభాస్. ఆల్రెడీ ‘సలార్-2’ చేయాల్సిన హోంబలే ఫిలిమ్స్ బేనర్లోనే ప్రభాస్ మరో రెండు సినిమాలు చేయనున్న విషయం తాజాగా వెల్లడైంది. మొత్తంగా రెబల్ స్టార్‌తో మూడు సినిమాల డీల్‌ను హోంబలే ఫిలిమ్స్ అనౌన్స్ చేసింది. కాగా మిగతా రెండు చిత్రాల్లో ఒకదానికి దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ పేరు వినిపిస్తుండడం విశేషం.
‘విక్రమ్’ సినిమా సెన్సేషనల్ హిట్ అయిన దగ్గర్నుంచి ప్రభాస్‌తో లోకేష్ కనకరాజ్ సినిమా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. లోకేష్ సైతం ప్రభాస్‌తో సినిమాకు ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. వీరి కలయికలో వేరే నిర్మాతలు సినిమా కోసం ప్రయత్నించారు. కానీ కుదరలేదు. కానీ ఇప్పుడు హోంబలే ఫిలిమ్స్.. ఈ డ్రీమ్ కాంబినేషన్లో సినమిా చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూలీ సినిమా చేస్తున్న లోకేష్.. ఆ తర్వాత ఖైదీ-2ను పట్టాలెక్కిస్తాడు.
ఇంకా విక్రమ్-2, రోలెక్స్ సినిమాలు కూడా చేయాల్సి ఉంది. వాటి కంటే ముందో వెనుకో.. వీలును బట్టి ప్రభాస్‌తో సినిమా చేస్తాడట లోకేష్. ఈ కలయికలో వచ్చే సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2026 లేదా 2027లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది. తమ బేనర్లో సలార్-2ను పూర్తి చేశాకే ప్రభాస్‌తో మిగతా రెండు సినిమాలు ప్లాన్ చేయనుంది ‘హోంబలే’ సంస్థ.