టాలీవుడ్ రెబల్ స్టార్, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ జరిగింది. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంస్మరణ సభకు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత ప్రభాస్ సొంత ఊరు మొగల్తూరుకు రావడంతో ఊరంతా ప్రభాస్ ఫ్యాన్స్ తో పోటెత్తింది. దాదాపు లక్ష మంది వరకు ప్రభాస్ ను చూసేందుకు వచ్చారని అంచనా.
ఈ క్రమంలోనే సంస్కరణ సభకు వచ్చిన వారందరికీ 22 రకాల నాన్ వెజ్ వంటకాలతో భోజనాలు పెట్టించారు ప్రభాస్. దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారు లక్ష మందికి నోరూరించే వంటకాలతో ప్రభాస్ ఆతిథ్యం ఇచ్చారని తెలుస్తోంది. వంటకాల్లో ముఖ్యంగా 6 టన్నుల మటన్ బిర్యానీ, 6 టన్నులు చికెన్ బిర్యానీ, 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల చికెన్ కర్రీతోపాటు రొయ్యలు, చేపలతో రకరకాల నాన్ వెజ్ వంటకాలను వండి వార్చారట.
ఇక, ఈ సంస్మరణ సభకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రులు రోజా, కారుమూరు నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు. కృష్ణంరాజు మృతితో రాష్ట్ర ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురయ్యారని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు అని చెప్పారు. మొగల్తూరులో కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని, అందుకుగాను 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుందని వెల్లడించారు.
ఈ విషయాన్ని కృష్ణంరాజు గారి కుటుంబ సభ్యులకు కూడా తెలిపామని చెప్పారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా హాజరయ్యారు. ప్రజల హృదయాల్లో కృష్ణంరాజు చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారని, అవినీతి మరక లేకుండా మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.