టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడిల కాంబోలో ‘హరిహర వీరమల్లు’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత తెలుగులో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్ కావడంతో పాటు పవన్ ఈ తరహా చిత్రంలో తొలిసారి నటిస్తుండడంతో ఆ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ చిత్రం నుంచి పవన్ ఫస్ట్ లుక్ మినహా మరే అప్డేట్ విడుదల కాలేదు.
ఈ క్రమంలోనే తాజాగా నేడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పవర్ గ్లాన్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నిమిషం నిడివి ఉన్న ఈ పవర్ గ్లాన్స్‌లో.. పవర్ స్టార్ ఎంట్రీ అదిరిపోయింది. మల్లయోధులతో పవన్ కుస్తీకి సై అంటూ.. తొడగొడుతూ పోరాటానికి దిగే సన్నివేశం పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెచ్చింది. మీసం మెలేస్తూ ప్రత్యర్థులను ఒట్టి చేతులతో మట్టి కరిపింపే సీన్ పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది.
‘‘దిగొచ్చిండు భళ్ళు భళ్ళునా. పిడుగే దిగొచ్చింది భళ్లు భళ్లునా.. మెడల్ని వంచి, కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకొని తొడకొట్టాడో.. తెలుగోడు ’’ అనే పాట ఆకట్టుకుంటోంది. పవన్ బర్త్ డే రోజున ఈ గ్లింప్స్ రూపంలో అదిరిపోయే ట్రీట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం #PowerGlance పేరుతో ఈ వీడియో యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
వాస్తవానికి, సెప్టెంబర్ 2న సాయంత్రం 5.45 గంటలకు పవర్ గ్లాన్స్ విడుదల చేయబబోతున్నట్లు చిత్ర యూనిట్ ముందుగా ప్రకటించింది. ఎందుకో తెలీదుగానీ, విడుదల సమయాన్ని సాయంత్రం 5.45 నుంచి ఉదయం 10.15కు మార్చింది పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.