ఉన్నట్టుండి కరెంటు పోతుంది. పనులు ఆగిపోతాయి. కానీ ఇవేవీ పట్టని ప్రభుత్వాలకు సాకులు మాత్రం దొరుకుతాయి. ఇవే ఇప్పుడు పెను శాపాలుగా మారనున్నాయి. పరిశ్రమలకు వారంలో ఒక రోజు సెలవు ఇవ్వమని చెబుతున్నారు. అలానే ఇంకొన్ని చోట్ల చిన్న తరహా పరిశ్రమలకు అప్రకటిత కోతలు విధిస్తున్నారు. ఇంత చేసినా కూడా రాత్రి పట్టుమని నాలుగు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు లోకేశ్ చెప్పిన విధంగా లాంతర్లే శరణ్యమా ? కొవ్వొత్తి వెలుగులే ప్రాణాధారమా ?
అంధకారం ఉన్నా కూడా భరించడం అంటే అసాధ్యం.. అంధకారం ఉన్నా కూడా ఇప్పుడేం చేయలేం అని చెప్పి తప్పుకోవడం ఇంకా భావ్యం కాని పని.పక్క రాష్ట్రంలో కోతలు లేవు అనగా తెలంగాణలో కోతలు లేవు. మరి ఇక్కడ మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకు ..ఈ నేపథ్యంలో ఇలా ప్రశ్నించుకోవాలి. రాత్రి ఎలా ఉంది. చీకటిమయం అయి ఉంది. రాత్రి ఎలా ఉంది.. అర్థం లేకుండా ఉంది. రాత్రి ఎలా ఉంది.. పేదవాడికీ డబ్బున్నవాడికీ ఒకేలా మాత్రం లేదు. ఇక్కడెంత అసమానత ఉందో..! పాలనలో కూడా అసమానతలు ఉంటాయి. ఉన్నాయి కూడా !
వాటిని నివారించే ప్రయత్నాలను జగన్ ఎందుకనో చేయడం లేదు. ఛార్జీలు పెంచాక కూడా తమకు ఎందుకీ అవస్థలు అని బాధపడుతున్న వారికి ఇప్పుడేం సమాధానం చెబుతారు? అప్పుడే గ్రామాల్లో కోతలు, పట్టణాల్లో కోతలు, నగరాల్లో కోతలు…ఉన్నోళ్లంతా జనరేటర్లతో కాలం వెచ్చించగలరు. కాస్త మధ్య తరగతి జీవులకు ఇప్పుడు ఇన్వర్టర్ ఖర్చు కూడా అదనం. మరి! ఏమీ లేని వాళ్ల సంగతి. పగలంతా కూలి చేసుకుని ఇంటికి చేరుకునే వారి సంగతి.?
ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెరగవు అని అనుకున్నవారికి నిజంగానే ఓ విధంగా చేదు వార్త. ఈ నెల నుంచి ఛార్జీల వడ్డన ప్రారంభం అయింది.ఆ ప్రకారం మూడేళ్లలో రెండు వందల నుంచి ఐదు వందల వరకూ పెరుగుదల.పోనీ వసూలు చేసిన డబ్బులతో నాణ్యమయిన విద్యుత్ ను నిరంతరాయంగా అందిస్తున్నారా అంటే అదీ లేదు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ భారాన్ని అందరి నెత్తిన రుద్ది చోద్యం చూస్తున్నారు. అప్పులు చేస్తూ కూడా జెన్కో బకాయిలు తీర్చలేకపోతున్నారు. బొగ్గు నిల్వలపై అస్సలు స్పష్టతే లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ గత రాత్రి కాళ రాత్రిని మరో సారి తలుచుకుని రాత్రి ఎలా ఉంది అని తల్చుకుని మళ్లీ భయాన్ని మళ్లీ ఆందోళననూ తలచుకోవాలి.