ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ పదవి కోసం పడుతున్న పోటీ అంతా ఇంతా కాదు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవటానికి రిపబ్లికన్లు.. డెమొక్రాట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ట్రంప్.. మరోసారి ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంటే.. ట్రంప్ నాలుగేళ్ల అధ్యక్ష పాలనకు చెక్ చెప్పి.. తానుపదవిని చేపట్టాలని జో బైడెన్ తహతహలాడుతున్నారు. ఇప్పటివరకు వెలువడిన అంచనాలు..సర్వేలు బైడెన్ కు అనుకూలంగా ఉండటం తెలిసిందే.
తాజా అధ్యక్ష ఎన్నికల్లో కోవిడ్ కీలకం కానుంది. ఈ మహమ్మారిని డీల్ చేసే విషయంలో ట్రంప్ ఫెయిల్ అయ్యారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. ట్రంప్ కంటే జోబైడెన్ కే ప్రజారోగ్య సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం. ఈ విషయాన్ని సగం కంటే ఎక్కువమంది భావిస్తున్న విషయాన్ని ప్యూ రిసెర్చ్ పరిశోధన తేల్చింది.
ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ కు టైం దగ్గరకు వస్తున్న వేళ.. విరుచుకుపడుతున్న కోవిడ్ సెకండ్ వేవ్ తుది ఫలితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. తాజాగా రోజుకు 90వేల మందికి కోవిడ్ సోకుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సగటున రోజుకు వెయ్యి మంది మరణించటం ట్రంప్ కు గుదిబండగా మారుతోంది. విజయవకాశాల్ని కోవిడ్ భారీగా దెబ్బ తీసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. పోలింగ్ తేదీకి ముందే.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా.. ఈమొయిల్ ద్వారా పెద్ద ఎత్తున ఓట్లు వేస్తున్నారు.
ఇప్పటివరకు 9 కోట్ల మంది ఈమొయిల్/పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓట్లను నమోదు చేసుకోవటం గమనార్హం. మరో 15 కోట్ల మంది ఇంకా ఓట్లు వేయాల్సి ఉంది. పోలింగ్ కు ముందే ఇంత భారీగా నమోదైన ఓట్ల లెక్క చూస్తుంటే.. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ సైతం రికార్డు స్థాయిలో జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.