టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సినీ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని పోసాని చేసిన ఆరోపణలు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్నాయి. తాను కోర్టుకు హాజరయ్యే సమయంలో చంపేందుకు ప్లాన్ వేస్తున్నారని ఆయన షాకింగ్ ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవేళ తాను చనిపోతే తన చావుకు నారా కుటుంబమే కారణమని పోసాని షాకింగ్ ఆరోపణలు చేశారు.
కంతేరు దగ్గర లోకేష్ భూమి కొన్న విషయాన్ని తాను గతంలో ఎప్పుడో అన్నానని, ఆ విషయంలో ఇప్పుడు పరువు నష్టం దావా వేశారని పోసాని అన్నారు. తాను కూడా లోకేష్ పై కేసు వేస్తానని చెప్పారు. జగన్ పై లోకేష్ కూడా విమర్శలు చేస్తున్నారని, ఆ విషయంలో తాను కేసు పెడితే 20 ఏళ్ల పాటు లోకేష్ కు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోసాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేష్ ల అక్రమాలు బట్టబయలు చేయడంతోనే వారు తనపై కక్షగట్టారని ఆరోపించారు.
నారా కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులు వేరు లోకేష్ పేరు మీద ఉన్న ఆస్తులు వేరా అని ఆయన ప్రశ్నించారు. లోకేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందనడానికి సాక్షాధారాలు లేవని, అయితే ఇది తన మరణ వాంగ్మూలంగా పరిగణించాలని పోసాని చెప్పారు. కాగా, కంతేరు వద్ద లోకేష్ 14 ఎకరాల భూమిని కొన్నారంటూ పోసాని కొద్ది నెలల క్రితం నిరాధార ఆరోపణలు చేశారని లోకేష్ పరువు నష్టం దావా కోర్టులో వేశారు. అంతేకాదు, గత శుక్రవారం పోసాని వ్యవహారం పై మంగళగిరి కోర్టులో తన వాంగ్మూలాన్ని కూడా లోకేష్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పోసాని ఆ వ్యవహారంపై ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.