ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి అరెస్టయ్యారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆయనను ఏపీకి చెందిన పోలీసులు అరెస్టు చేశారు. గతంలో వైసీపీ ప్రధాన అధికార ప్రతినిధిగా సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన.. జగన్ హయాంలో టీవీ, ఫిలిం కార్పొరేషన్‌కు చైర్మన్‌గా కూడా పనిచేశారు. అయితే.. సోషల్ మీడియా సహా ప్రధాన మీడియాల్లో అప్పటి విపక్ష నేత చంద్రబాబు, జనసేన నాయకుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డా రు. అదేవిధంగా టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్‌పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. పోసాని కృష్ణమురళిపై అనేక జిల్లాల్లో ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో అప్పట్లోనే ఆయన అరెస్టు ఖాయమన్నవాదన వినిపించింది. ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన పోసాని.. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఇకమీదట ఏ పార్టీకి, ఏ నాయకుడికి తన మద్దతు ఉండదని కూడా వెల్లడించారు. గత కొంత కాలంగా పోసాని.. మౌనంగానే ఉంటున్నారు. అసలు ఆయన ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు.
కానీ, హఠాత్తుగా ఏపీలోని కడప జిల్లా రాయచోటి పోలీసులు బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని గచ్చి బౌలిలో ఉన్న పోసాని కృష్ణ మురళి ఇంటికి వెళ్లి.. ఆయనను అరెస్టు చేశారు. రాయచోటి పోలీసు స్టే షన్లో నమోదైన ఓ కేసులో ఆయనను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. గతంలో పవన్ కల్యాణ్‌ను `వాడు-వీడు` అని వ్యాఖ్యానించడం.. మూడు పెళ్లిళ్లు చేసుకుని సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నాడని ప్రశ్నించడంతో మెగా అభిమానులు సహా.. పవన్ కల్యాణ్ అభిమానులు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాయచోటిలోని పవన్ అభిమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ నుంచి కడప జిల్లా రాయచోటికి తరలించనున్నారు.