సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీకి టాలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖులు 2019 ఎన్నికలకు ముందు నుంచి మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. నాటి ప్రతిపక్ష నేతగా జగన్ చేపట్టిన పాదయాత్రలో సైతం కమెడియన్ పృథ్వీరాజ్, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. ఇక, వైసీపీ తరఫున ప్రముఖ కమెడియన్ అలీ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ కు ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టడం, ఆ తర్వాత తొలగించడం జరిగిపోయాయి.
ఇక, చాలాకాలం నుంచి పదవి కోసం ఎదురుచూస్తున్న అలీని కూడా కొద్ది రోజులు క్రితమే ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా జగన్ నియమించారు. దీంతో, పోసాని కృష్ణ మురళికి ఎటువంటి పదవి దక్కలేదన్న టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ ప్రకారం పోసాని నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా నేడు జారీ చేసింది.
అలీని రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించిన కొద్ది రోజులకే పోసానికి కూడా పదవి కట్టబెట్టడం విశేషం. ఇక, సీఎం జగన్ కు పోసాని కృష్ణ మురళి పలు సందర్భాలలో బహిరంగ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నో మీడియా సమావేశాలలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలపై కూడా పోసాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ దశలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై సైతం పోసాని విమర్శలు గుప్పించడం సంచలనం రేపింది.
అయితే, కొంతకాలంగా పోసాని కృష్ణ మురళి పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారని టాక్ వచ్చింది. ముఖ్యంగా సినిమా టికెట్ల వ్యవహారంలో సినీ పెద్దలతో సీఎం జగన్ జరిపిన భేటీలో పోసాని అర్ధాంతరంగా వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. పార్టీకి, పోసానికి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని టాక్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా పోసానికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడం విశేషం.