పోర్చుగల్ లోని ఒక భారత మహిళకు సరైన సమయంలో చేయాల్సిన వైద్యం చేయకపోవటంతో ఆ మహిళ మరణించింది. దీనిపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్య మంత్రి తన పదవికి రాజీనామా చేయటం గమనార్హం. మూడు.. నాలుగు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీం పట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళల్లో నలుగురు మరణించటం.. వారి మరణానికి కారణం సరైన వైద్య వసతులు లేకపోవటం అన్న సంగతి తెలిసిందే.
నలుగురు మహిళలు మరణించినప్పటికీ.. దానికి సంబంధించిన చర్యలు కానీ.. నైతిక బాధ్యత కానీ ఇప్పటికీ తీసుకోని పరిస్థితి. ఇందుకు భిన్నంగా పోర్చుగల్ ఉదంతం చోటు చేసుకుంది. భారత్ కు చెందిన 34 ఏళ్ల మహిళ పోర్చుగల్ లో నివసిస్తున్నారు. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న ఆమె ప్రసవం కోసం ఆ దేశ రాజధాని నగరమైన శాంటా మారియా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఖాళీ లేకపోవటంతో ఆమెను నగరంలోని మరో ఆసుపత్రికి తరలించేందుకు నిర్ణయించారు.
అంబులెన్సులో తీసుకెళుతుండగా ఆమెకు గుండెపోటు రావటం.. ఆసుపత్రికి వెళ్లే లోపే ఆమె ప్రాణాల్ని కోల్పోయారు. దీంతో అత్యవసర చికిత్స చేసిన వైద్యులు చిన్నారిని మాత్రం రక్షించగలిగారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. తల్లిని మాత్రం కోల్పోయింది.ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోర్చుగల్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. ప్రభుత్వం మీద వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆ దేశ ఆరోగ్య మంత్రిగా వ్యవహరిస్తున్న టొమిడో తాను ఆ బాధ్యతల్ని కొనసాగించలేనని పేర్కొంటూ.. తన పదవికి రాజీనామా చేశారు.
కరోనా సమయంలో టొమిడో సేవలు అద్భుతంగా ఉన్నాయన్న పేరుంది. అయినప్పటికీ తాజాగా వచ్చిన విమర్శలకు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయటం గమనార్హం. ఏమైనా.. తనకు నేరుగా సంబంధం లేకున్నా.. ఒక విదేశీ మహిళ తమ దేశంలో ప్రాణాలు కోల్పోయిన దానిని అక్కడి రాజకీయ నేతలు ఎంత సీరియస్ గా తీసుకుంటారన్నది చూస్తున్నప్పుడు.. మన రాజకీయ నాయకుల చర్మం.. మనసు ఎంతగా బండబారిపోయినట్లు ఉంటుందన్నది ఇట్టే అర్థమవుతుంది.
అభివ్రద్ధి చెందిన పోర్చుగల్ లో ఇలాంటి సమస్య ఎందుకు వచ్చినట్లు? అన్న ప్రశ్నకు.. ఇటీవల కాలంలో ఆ దేశంలో గైనకాలజీ నిపుణులతో పాటు ఇతర వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాలకు చెందిన వైద్య నిపుణులను ఆ దేశం భారీగా నియమించుకుంటున్నా.. కొరత మాత్రం తీరని పరిస్థితి.
Comments 1