విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన ‘రా… కదలిరా’ సభలో సీఎం జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను పెత్తందారుడుని.. కనీసం డ్రాయర్ కూడా లేని నిరుపేద జగన్’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సాక్షి పేపర్, సాక్షి టీవీ లేవని, ప్యాలెస్ లు, ప్యాక్టరీలు కూడా లేవని ఎద్దేవా చేశారు. ముద్దులకు మురిసిపోయి ప్రజలు ఓట్లు గుద్దారని, ఇప్పుడు జగన్ పిడిగుద్దులు గుద్దుతున్నాడని సెటైర్లు వేశారు.
జగన్ పాలనలో ప్రజలు సంక్రాంతి జరుపుకునే పరిస్ధితి లేదని విమర్శించారు. జన సునామీతో బొబ్బిలి కోట బొబ్బిలి పులిలా గర్జిస్తోందని, ఆ గర్జనకు తాడేపల్లి ప్యాలెస్ పిల్లి వణికిపోతోందని అన్నారను. స్వార్ధంతో సైకో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసమే ‘రా… కదలిరా’ ప్రారంభించానని చెప్పారు. తాను ఐటీ అభివృద్ది చేయడం వల్లే అనేక దేశాల్లో తెలుగు జాతి స్ధిరపడిందని, తనకు కష్టం వచ్చినపుడు 80 దేశాల్లో తెలుగు వారు మద్దతు తెలిపడం తెలుగు వారి సత్తాకు నిదర్శనమని చెప్పారు.
రాష్ట్రాన్ని జగన్ అన్ని రంగాలలో రివర్స్ లో టాప్ లో పెట్టాడని, జగన్ ఆదాయం మాత్రం టాప్ గేర్ లో ఉందని చెప్పారు. దేశంలోకెల్లా రిచెస్ట్ సీఎం జగన్ అని, ఈ ఐదేళ్లలో పేదల ఆదాయం పెరగలేదని చెప్పారు. 5 ఏళ్లలో దోచుకోవాల్సిదంతా దోచుకుని పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నారని విమర్శించారు.
ఉత్తరాంధ్రలో మళ్లీ బీసీల రాజ్యం వస్తుందని, టీడీపీ – జనసేన ప్రభుత్వం బీసీలను అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. ఉత్తరాంధ్రకి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను జగన్ సామంతరాజులుగా నియమించారి ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర నుంచి బీసీ నాయకుడు ఎర్రన్నాయుడును కేంద్రమంత్రిని చేసిన ఘనత టీడీపీదని, కిమిడి కళా వెంకట్రావు సహా ఎంతో మందికి మంత్రి పదవులిచ్చామని చెప్పారు.
జగన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో ఉన్న ఆస్తులపై తప్ప ప్రజలపై ప్రేమ లేదని, విశాఖలో రూ.40 వేల కోట్ల ఆస్తులు కొట్టేశారని ఆరోపించారు. మెడపై కత్తి పెట్టి బెదిరించి ఆస్తులు, భూములు రాయించుకుంటున్నారని ఆరోపించారు.
కోడిగుడ్డు మంత్రికి జగన్ సీటు ఇవ్వలేదని, సొంత నియోజకవర్గంలో చెత్త మరో నియోజకవర్గంలో బంగారం అవుతుందా? అని ప్రశ్నించారు. ఎక్కువ తిడితే బూతు శ్రీ… ఇంకా ఎక్కువ తిడితే బూతు రత్న… బూతు భూషణ్… బూతు సామ్రాట్! ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎమ్మెల్యే సీటు అని అన్నారు.