మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్లు ఎంతటి గ్లామర్ పాత్రలు చేయడానికి అయినా సిద్ధపడతారు. కానీ, హీరోలకు చెల్లెలి పాత్రను చేయడానికి మాత్రం అస్సలు ఒప్పుకోరు. హీరోలకు చెల్లెలి పాత్రను చేసి ఆ తర్వాత స్టార్డమ్ను కోల్పోయిన తారలు ఎందరో ఉన్నారు. అందుకే హీరోయిన్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ మాత్రం ఓవైపు స్టార్ హీరోలతో జోడీ కడుపుతూనే.. మరోవైపు రజనీకాంత్, చిరంజీవి వంటి సీనియర్ స్టార్లకు చెల్లెలుగా నటిస్తోంది.
అయితే ఇప్పుడు పూజా హెగ్డే సైతం అటువంటి డేరింగ్ స్టెప్ వేస్తోందట. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ఈ బుట్టబొమ్మ గత కొంత కాలం నుంచీ వరుస ఫ్లాపులతో సతమతం అవుతోంది. ఈమె నుంచి చివరిగా వచ్చిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయినప్పటికీ ఈ భామ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ కొత్త ప్రాజెక్ట్స్ ను టేకప్ చేస్తోంది.
ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఉన్న సినిమాల్లో `కభీ ఈద్ కభీ దివాలి` ఒకటి. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరో కాగా.. ఫర్హద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ముంబైలో ప్రారంభం అయింది. వాస్తవానికి ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారని గత కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
కథలో ఆయన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే జూన్ నుంచి వెంకీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడని కూడా అంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. విభిన్నమైన యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో వెంకటేష్ కు సోదరిగా పూజా హెగ్డే నటించబోతోందట.
వీరిద్దరి మధ్య కొన్ని కీలక సన్నివేశాలు సైతం ఉంటాయని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. నెట్టింట మాత్రం హాట్ టాపిక్ గా మారింది. కాగా, వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం `ఎఫ్ 3`లో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేసింది. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.