తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆ పార్టీలోనుంచి ఈ పార్టీలోకి వలసలు…జంప్ జిలానీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరబోతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటికీ సంచలన వార్నింగ్ ఇస్తూ ఖమ్మంలో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవు అంటూ ఆ పోస్టులలో వార్నింగ్ ఇచ్చిన వైనం తెలంగాణలో సంచలనం రేపుతోంది.
బీఆర్ఎస్ నేతలు, మంత్రి పువ్వాడ అజయ్ పై పొంగులేటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పొంగులేటికి గుర్తు తెలియని వ్యక్తులు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తాజాగా పొంగులేటి స్పందించారు. చట్టం మీ చుట్టమా కేసీఆర్ అని పొంగులేటి ప్రశ్నించారు. ఎంతమందిని చంపుతారో చంపండి చూస్తామంటూ ఛాలెంజ్ చేశారు. తనకు గాని, తన కార్యకర్తలకు గాని ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యత అని పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులెవరూ భయపడవద్దని, ప్రతి ఒక్క అనుచరుడిని కాపాడుకుంటామని పొంగులేటి అన్నారు.
తాటాకు చప్పుళ్ళకు, బెదిరింపులకు భయపడనని చెప్పారు. తనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన పనిలేదని అన్నారు. కొందరు పోలీసు అధికారులు….బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారంతా గులాబీ షర్ట్లు వేసుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. అటువంటి అధికారులు రేపు శిక్షకు గురికాక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతానని అన్నారు. కాగా, పొంగులేటి బీఆర్ఎస్ ని వీడడంతో భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతోపాటు 56 మంది సర్పంచ్ లు, 26 మంది ఎంపీటీసీలు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మరి, పొంగులేటి కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.