కాంగ్రెస్ అధిష్టానానికి మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కొన్ని షరతులు విధించినట్లు సమాచారం. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యేందుకు పొంగులేటి, జూపల్లి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో వీళ్ళిద్దరితో రాహుల్ భేటీ అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆదివారం కాంగ్రెస్ నేతలతో జరిగిన భేటీలో పొంగులేటి పెద్ద షరతు విధించినట్లు తెలుస్తోంది. ఆ షరతు ఏమిటంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో తాను సూచించిన వాళ్ళకే టికెట్లు కేటాయించలని.
నిజానికి కాంగ్రెస్ లో ఇలాంటి షరతులతో ఎవరు చేరలేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్నది సముద్రంలాంటిది. పార్టీలోకి ఎంతోమంది నేతలు వస్తుంటారు, పోతుంటారు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారనే విషయంలో పార్టీ అధిష్టానానికి పెద్దగా పట్టింపుండదు. ఉన్నవాళ్ళే తమ నేతలన్న ధోరణితో అధిష్టానం వ్యవహరిస్తుంటుంది. అలాంటిది ఇపుడు పొంగులేటి జిల్లాలోని పది అసెంబ్లీ టికెట్లు తాను సూచించిన వాళ్ళకే ఇవ్వాలని పట్టుబడితే వర్కవుటయ్యేది కష్టమే.
ఎందుకంటే ఇదివరకు జరిగిన చర్చల్లోనే పొంగులేటి కోటాకింద జిల్లాలో నాలుగుసీట్లు ఇవ్వటానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. వైరా, అశ్వరావుపేట, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాలను పొంగులేటి వర్గానికి కేటాయించటానికి అధిష్టానం అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం లేదా కొత్తగూడెంలో పొంగులేటి పోటీచేయబోతున్నారు. బీఆర్ఎస్ కీలకనేత, మంత్రి పువ్వాడ అజయ్ ను ఓడించాలని పొంగులేటి అనుకుంటే ఖమ్మంలో పోటీచేస్తారు. లేదా కొత్తగూడెంలో పోటీకి దిగుతారు.
అంటే పొంగులేటి టికెట్ తో పాటు నాలుగు సీట్లను కేటాయించేందుకు అధిష్టానం ఓకే చెప్పిందట. ఇదే నిజమైతే అధిష్టానం ఒకమెట్టుదిగి పొంగులేటి డిమాండ్లకు అంగీకరించినట్లే. అయితే తాజా ప్రచారం ప్రకారం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికే టికెట్లంటే అధిష్టానం అంగీకరించటం కష్టమే. ఎందుకంటే సీఎల్సీ నేత భట్టి విక్రమార్క మధిర సిట్టింగ్ ఎంఎల్ఏ. ఈయన కోటాలో కూడా కొన్ని టికెట్లు ఇవ్వాల్సుంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారమైపోతాయి. మరి రాహుల్ తో భేటీలో ఏమి మాట్లాడుతారో చూడాలి.