మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమైనట్లే ఉంది. పై నేతలిద్దరు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. వీళ్ళిద్దరినీ చేర్చుకోవాలని బీజేపీ చాలా ప్రయత్నాలుచేస్తోంది. చేరికల కమిటి ఛైర్మన్ ఈటల రాజేందర్ నాయకత్వంలోనే రెండుమూడుసార్లు పెద్ద బృందమే వీళ్ళతో చర్చించింది. అయినా వీళ్ళనుండి సానుకూలస్పందన కనబడలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు కూడా పొంగులేటి, జూపల్లితో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు.
ఇదే విషయమై ఈటల మీడియాతో మాట్లాడుతు తాను స్వయంగా ఇద్దరు నేతలతో మాట్లాడినా వాళ్ళు బీజేపీలో చేరటానికి అంత సుముఖంగా లేరని చెప్పారు. ఇతర పార్టీల్లో చేరకుండా వీళ్ళని ఆపగలిగానే కానీ బీజేపీ చేరేట్లుగా ఒప్పించలేకపోయానన్నారు. తాజా పరిణామాలను చూసిన తర్వాత వీళ్ళిద్దరు బీజేపీలో చేరుతారని చెప్పలేకపోతున్నట్లు చెప్పారు. బీజేపీలో చేరటానికి వీళ్ళకి ఏదో ఇబ్బందులున్నట్లు ఈటల అనుమానం వ్యక్తంచేశారు.
వీళ్ళిద్దరు బీజేపీలో చేరేది అనుమానమే అని స్వయంగా ఈటలే చెప్పినతర్వాత ఇక వీళ్ళెందుకు చేరుతారు. ఈటల తాజా ప్రకటనతో వీళ్ళు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఖమ్మంజిల్లాలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మంచిపట్టుందని ఈటల అంగీకరించారు. ఖమ్మంలో బీజేపీకి నామమాత్రపు పట్టుకూడాలేదు. ఖమ్మం ఎంపీగా చేసిన పొంగులేటి ఇక బీజేపీలో ఎందుకు చేరుతారు. ఇప్పటి పరిస్దితుల ప్రకారం రాబోయే ఎన్నికల్లో పొంగులేటి గెలవటం తనకు చాలా అవసరం.
కేసీయార్ తో ఓపెన్ చాలెంజ్ చేసి బీఆర్ఎస్ ఓటమికి కంకణం కట్టుకున్న కారణంగా పొంగులేటి కాంగ్రెస్ లో చేరటమే కరెక్టనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే కాంగ్రెస్ కున్న ఓటుబ్యాంకుకు పొంగులేటి మద్దతు, ఆర్ధిక వనరులు తోడయితే మంచి ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పొంగులేటితో ఇదివరకే చెప్పారు. కాకపోతే ఏవో కారణాలతో నిర్ణయంతీసుకోని పొంగులేటి తాజాగా ఈటల వ్యాఖ్యలతో నిర్ణయం తీసుకునే అవకాశముంది. మొత్తానికి పొంగులేటి, జూపల్లి ఇద్దరు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ఈటల పరోక్షంగా హింట్ ఇచ్చినట్లే అనిపిస్తోంది.