ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. ముఖ్యమంత్రి కొత్తగా ఏర్పాటు చేసే మంత్రివర్గంలో ఎవరికి చోటు ఉంటుందా? అని విషయమే ప్రధానాంశంగా మారింది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులుంటాయని 2019లో అధికారం చేపట్టినపుడు జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. మరో మూడు నెలల్లో ఆ గడువు ముగియనుంది. దీంతో ఇప్పటికే మంత్రివర్గంలో ఎవరిని ఉంచుతారు? ఎవరిని తొలగిస్తారు? కొత్తగా ఎవరికి చోటు కల్పిస్తారు? అనే ఆసక్తి మొదలైపోయింది. జగన్ కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే ఆయన తన పెళ్లి రోజు వేడుకల కోసం ప్రస్తుతం సిమ్లా పర్యటనకు వెళ్లారని బయటకు చెప్తున్నప్పటికీ ఈ టూర్ వెనక ఈ మంత్రి వర్గ విస్తరణ వ్యూహం కూడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార కార్యక్రమాలకు అయిదు రోజుల పాటు విరామమిచ్చిన జగన్.. తన 25వ పెళ్లి రోజు వేడుకలను జరుపుకునేందుకు సిమ్లా వెళ్లిన సంగతి తెలిసిందే. తన కుటుంబంతో సహా ఆయన అక్కడికి చేరుకున్నారు. బయటకు ఇది జగన్ ఫ్యామిలీ టూర్లా కనిపిస్తున్నప్పటికీ ఇది పూర్తిగా రాజకీయ పర్యటన అని సీఏం కార్యాలయ వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో మంత్రవిర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనలోనే జగన్ కొత్త మంత్రుల జాబితాను ఖరారు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు జగన్ పనితీరు పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయి వచ్చే రెండేళ్లు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే అంశంపైనా ఈ టూర్లోనే చర్చించనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఆ అధికార వైసీపీకి చెందిన కొంతమంది కీలక నేతలు జగన్ కంటే ఒక రోజు ముందే సిమ్లా చేరుకున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా మంత్రి పదవిని ఆశిస్తున్న వైసీపీ నేతల సంఖ్య భారీగానే ఉంది. తమ మంత్రి పదువులు నిలబెట్టుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్న నాయకులూ అదే స్థాయిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రకటించే నూతన మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులు ఇవ్వాలని తాడేపల్లిలోని జగన్ అధికార నివాసానికి చాలా సార్లు వెళ్లివచ్చారు. జగన్ దర్శనం చేసుకుని తమ మనసులో మాటను బయటపెట్టారు. మరోవైపు ఈ సారి కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్న అంబటి రాంబాబు లాంటి నేతలు తాజాగా ఆడియో లీక్ వివాదంలో చిక్కుకోవడం ఇబ్బందిగా మారింది. అయితే ఈ ఆడియో లీక్ల వెనక సొంత పార్టీ నేతలే ఉన్నారనే సమాచారం జగన్కు చేరినట్లు సీఎంవో వర్గాలు చెప్తున్నాయి.
మరోవైపు నగరి ఎమ్మెల్యే రోజాను మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో దాదాపు 90 శాతం మందికి జగన్ ఉద్వాసన పలకనున్నారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా దేవాదాయ, విద్యాశాఖ మంత్రులకు ఈ విషయాన్ని ఇప్పటికే నేరుగా జగన్ చెప్పినట్లు సమాచారం. దీంతో తమ పదవులు కాపాడుకోవడానికి మంత్రులు ప్రయత్నాలు మొదలెట్టారు. తాజాగా అవంతి ఆడియో టేపులు కూడా బయటకు రావడంతో ఆయన మంత్రి పదవిపై వేటు పడే ప్రమాదముంది. జగన్ సిమ్లా నుంచి వచ్చిన తర్వాతే కేబినేట్లో మార్పుల విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.