రాజకీయాల్లో ఒకప్పటి హుందాతనం లేదనే చెప్పాలి. ప్రత్యర్థులు చేసే విమర్శలను సానుకూలంగా తీసుకునే నాయకులే ఇప్పుడు కనిపించడం లేదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రస్తుత రాజకీయ నాయకులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పరస్పర మాటల యుద్ధం దాటి.. నేతల ఇళ్లపై దాడుల వరకూ పరిస్థితి వెళ్లింది. అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో ఇదే పరిస్థితి కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై అధికార పార్టీ వైసీపీపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని వాటికి తక్షణమే క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అదీ కాకుండా ఎమ్మెల్యే జోగి రమేశ్ ఓ అడుగు ముందుకేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి ప్రయత్నించడం తెలిసిందే. ఆ సమయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణే చోటు చేసుకుంది. కీలక నేతలకూ గాయాలయ్యాయి.
ఇక ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఇటు మల్లారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడేందుకు ప్రయత్నించాయి. ఇప్పుడు తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య హాట్ ఫైట్ నడుస్తోంది. దీంతో మళ్లీ రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. అటు ఢిల్లీలో ఏమో మజ్లిస్ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గృహంపై తాజాగా దాడి జరిగింది. హిందూ సేన నాయకులు ఈ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. రాజకీయ నేతల ఇళ్లపై ఈ దాడులు చూస్తుంటే ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందని నిపుణులు అంటున్నారు. ప్రజాస్వామ్య వాదాలు ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.