సినిమా -రాజకీయం.. ఈ రెంటికీ విడదీయరాని బంధం ఉంది దక్షిణాదిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నందమూరి తారకరామారావు ఎంతగా ప్రభావితం చేశారో తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చారు. మరోవైపు తమిళనాడులో సుదీర్ఘ కాలం పాటు సినిమా వాళ్లే ఆ రాష్ట్రాన్ని ఏలారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయడం ఒకెత్తయితే.. రాజకీయ నాయకులు, అంశాల మీద సినిమాలు తీసి ఎన్నికల ముంగిట రిలీజ్ చేయడంలో మరో ఎత్తు.
ఇలాంటి ప్రయత్నాలు ఎప్పట్నుంచో జరుగుతున్నాయి. కానీ ప్రస్తుత కాలంలో వాటి ప్రభావం జనాల మీద ఏమాత్రం ఉంటోందన్నది సందేహంగా మారింది. గత ఎన్నికల ముంగిట అధికార పార్టీకి అనుకూలంగా యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు.. ప్రతిపక్ష పార్టీకి కలిసొచ్చేలా యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు వదిలారు. వీటిలో ఏదీ గొప్పగా ఆడేయలేదు. యాత్ర ఒక్కటే పర్వాలేదనిపించింది. ఆల్రెడీ వైసీపీకి మంచి ఊపు ఉండగా.. ప్రత్యేకంగా ఈ సినిమా ఆ పార్టీకి కలిసి వచ్చేసిందని చెప్పలేని పరిస్థితి.
ఇక వర్తమానంలోకి వస్తే.. ఆల్రెడీ రెండు పొలిటికల్ సినిమాలు వచ్చాయి. ఏపీ సీఎం జగన్ మీదే యాత్ర-2 అనే సినిమా తీశారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. వైసీపీ వాళ్లు మాత్రం ఈ సినిమా గురించి ఆహా ఓహో అన్నారు. పదుల కోట్లు పెట్టి తీసిన ఆ సినిమా న్యూట్రల్ ఆడియన్స్ మీద ఎలాంటి ప్రభావం చూపినట్లుగా కనిపించడం లేదు. ఇక జగన్‌ను టార్గెట్ చేస్తూ తీసిన ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ వరకు ఆకర్షణీయంగా అనిపించింది. సినిమాగా అది మెప్పించలేదు.
కొన్ని సీన్ల వరకు ఓకే అనిపించిందంతే. మంచి సినిమా అయినా బాగా తీయకపోవడంతో జనాల్లోకి చొచ్చుకెళ్లలేదు. రెండు వారాల వ్యవధిలో రెండు పొలిటికల్ సినిమాలు వాషౌట్ అయిపోగా.. ఇక వర్మ సినిమాలు వ్యూహం, శపథం దాడికి సిద్ధమయ్యాయి. వర్మ సినిమాల క్వాలిటీ, ప్రాపగండా తెలిసిందే కాబట్టి అవి కూడా పెద్దగా ప్రభావం చూపడం కష్టమే. మొత్తంగా చూస్తే రాజకీయ ప్రయోజనం ఆశించి కోట్లు పెట్టి సినిమాలు తీయడం వల్ల జనాలను ఏమాత్రం ప్రభావితం చేయగలుగుతున్నారన్నది సందేహంగానే కనిపిస్తోంది.