ప్రభుత్వ వైఫల్యాలపై, జగన్ పాలనపై కొంతకాలంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతున్న పట్టాభిని వైసీపీ నేతలు టార్గెట్ చేయడం, ఆయన ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడం సంచలనం రేపింది. ఆ తర్వాత పట్టాభి బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే, పట్టాభి అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పట్టాభిని అరెస్టు చేసిన తర్వాత…కోర్టు నుంచి మచిలీపట్నం జైలుకు తీసుకువెళుతున్న సమయంలో ఆయనను కొట్టారని ఆర్ఆర్ఆర్ షాకింగ్ ఆరోపణలు చేశారు. పట్టాభిని కొట్టారో లేదో విజయసాయి చెప్పాలని, పట్టాభిని కొట్టారన్న విషయంపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని రఘురామ అన్నారు. ఏపీలో ప్రభుత్వానికి, పోలీసులకు తేడా లేదని, కానీ, తనకు పోలీసులంటే గౌరవముందని చెప్పారు. అయితే, కొందరు పోలీసుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిపై దాడి చేయడం తప్పని, దీనిని పోలీసులు ఖండిస్తారని తనకు తెలుసని రఘురామ అన్నారు. పోలీసులు ఎవరైనా తనను సంప్రదిస్తే పట్టాభిపై దాడి వివరాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. సీఎం ఆఫీసు నుంచి రాసి ఇచ్చినవి వైసీపీ నేతలు చదువుతున్నారని రఘురామ ఆరోపించారు. కొందరు పోలీసులను చూస్తుంటే తనకు బాధ కలుగుతోంది అన్నారు.
కొందరు అధికారుల గురించి సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని, సాక్ష్యాధారాలతో సహా కొన్ని సంచలన విషయాలు బయటపెడతానని అన్నారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు స్వతంత్రగా వ్యవహరిస్తారని అనుకుంటున్నానని రఘురామ అభిప్రాయపడ్డారు. గంజాయికి సంబంధించి విజయసాయిరెడ్డి చెప్పిన దాంట్లో తప్పేం లేదని, ఏపీలో పట్టుకోలేకపోవడం వల్లే బయటి రాష్ట్రాల్లో పోలీసులు గంజాయి ముఠాలను పట్టుకుంటున్నారని సెటైర్లు వేశారు.