టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు రకరకాలుగా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఫ్లెక్సీలు చించాలని లోకేష్ టిడిపి కార్యకర్తలను ప్రేరపించినట్టుగా ఆరోపణలు చేస్తూ లోకేష్ పై టిడిపి కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా ఏలూరు జిల్లా భువనపల్లి వద్ద లోకేష్ సైట్ క్యాంప్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది.
వైసీపీ నేతలపై యువగళం కార్యకర్త ఒకరు దాడి చేశారని, అతడిని అప్పగించాలని పోలీసులు డిమాండ్ చేశారు. అయితే, టిడిపి నేతలు దానికి ఒప్పుకోకపోవడంతో వారితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అనుమతి లేకుండా లోకేష్ శిబిరంలోకి ఎలా వస్తారంటూ పోలీసులను యువగళం బృందం నిలదీసింది. అయితే, తమ రక్షణ లేకుండా పాదయాత్ర ఎలా కొనసాగిస్తారంటూ యువగళం బృందానికి పోలీసులు వివాదాస్పదరీతిలో జవాబిచ్చారు. ఈ క్రమంలోనే శిబిరం నుంచి బయటికి రావాలంటూ మిగిలిన పోలీసు సిబ్బందిని ఎస్ఐ ఆదేశించడంతో ఘటనా స్థలంలో ఉద్రిక్తత సద్దుమణిగింది.
ఈ క్రమంలోనే నిడమర్రులో ఫ్లెక్సీల వ్యవహారంపై లోకేష్ స్పందించారు. ఒక్కరోజైనా తన పాదయాత్ర జరగకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను పాదయాత్ర చేస్తున్న దారిలో తనను, టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెడుతున్నారని లోకేష్ ఆరోపించారు. తమ నాయకుడు చంద్రబాబును అవమానించేలా ఫ్లెక్సీలు పెడితే చింపేస్తామని లోకేష్ హెచ్చరించారు. మీరు చేసిన అక్రమాలపై ఫ్లెక్సీలు పెట్టమంటారా జగన్ అంటూ సూటిగా ప్రశ్నించారు. అంధకార ప్రదేశ్ అనే పథకాన్ని జగన్ కొత్తగా తెచ్చారని, 24 గంటలు విద్యుత్ ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం ఇది అని విమర్శలు గుప్పించారు.
పోలవరం కుడి కాలువ మట్టి తవ్వి అమ్మేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేతలను జగన్ పెయిడ్ ఆర్టిస్టులు అంటుంటారని, కానీ, జగన్ పెద్ద డ్రామా ఆర్టిస్టని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ సినిమాల్లో నటిస్తే భాస్కర్ అవార్డు ఖాయమని చురకులంటించారు. దసరాకు అందరూ ఆయుధ పూజ చేస్తే, జగన్ మాత్రం కోడి కత్తి పూజ చేస్తారని సెటైర్లు వేశారు. జగన్ ను పొడిచింది బొత్స మేనల్లుడు శీను అని లాయర్ సలీం చెప్పిన విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు. జగన్ ది దరిద్రపు కాలని, ఆయన హయాంలో వానలు లేవని, 122 ఏళ్ల తర్వాత ఆగస్టులో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయింది అని విమర్శించారు.